
టేకులపల్లి, వెలుగు: దేశ వ్యాప్తంగా రావణాసురుడి బొమ్మ దహనాన్ని నిషేధించాలని పీడీఎస్యూ, ఎమ్మార్పీఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం టేకులపల్లిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రెసిడెంట్ కాపాంటి పృథ్వీ, టీపీఎఫ్ జిల్లా ప్రెసిడెంట్మెంతెన సంజీవరావు, న్యూడెమోక్రసీ లీడర్లు వీరబ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, ఎల్హెచ్పీహెచ్ లీడర్ నామానాయక్, ఎమ్మార్పీఎస్ లీడర్ ప్రభాకర్, తుడుందెబ్బ లీడర్ దుర్గారపు వీరభద్రం రావణాసురుడి ఫొటోకు నివాళులర్పించారు. యూరప్ నుంచి వలస వచ్చిన ఆర్యులు స్థానిక రాజులపై దాడులు జరిపి వారిని ఓడించి వారి భూభాగాలను ఆక్రమించుకున్నారన్నారు. వాళ్లు రాక్షసులు కాబట్టే యుద్ధంలో ఓడిపోయారని ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారన్నారు. ఈక్రమంలోనే రావణాసురుడిని చంపిన రోజు అని విజయ దశమిని, నరకాసురుడిని చంపి దీపావళి అని, మహిషాసురుడు , శిబి చక్రవర్తి లాంటి రాజులను చంపి దేశంలో పండుగలు చేసుకునే సంస్కృతిని ప్రోత్సహించారన్నారు. ఇలాంటి నిజాలు తెలుసుకోవాలని, వేడుకల్లో పాల్గొనకూడదన్నారు. విజయదశమి పేరుతో రావణాసురుడు ఫొటోలను పేల్చి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నారన్నారు. ఇలా వాతావరణ కాలుష్యానికి కూడా కారకులవుతున్నారన్నారు.