యురేనియం తవ్వొద్దు: మైనింగ్​తో నల్లమల జీవ వైవిధ్యంపై ప్రభావం

యురేనియం తవ్వొద్దు: మైనింగ్​తో నల్లమల జీవ వైవిధ్యంపై ప్రభావం

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్​లో యురేనియం తవ్వి తీయాలన్న ఆలోచనను కేంద్రం వెంటనే విరమించుకోవాలని పలువురు నేతలు డిమాండ్​ చేశారు. లేకపోతే ఆగస్టులో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్​ కూడా తమ పోరాటాలకు కలిసి రావాలని కోరారు. ఆదివారం హైదరాబాద్​ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు, పర్యావరణ పరిరక్షణ’ అనే అంశంపై సీపీఎం రౌండ్​టేబుల్​ సమావేశాన్ని నిర్వహించింది. యురేనియం తవ్వకాలతో అమ్రాబాద్​, పదర మండలాల్లోని 42 గ్రామాలకు చెందిన 70 వేల మంది నిరాశ్రయులవుతారని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

వేల ఏండ్ల నాటి నల్లమల జీవ వైవిధ్యం నాశనమవుతుందన్నారు. దేశంలో 6,780 మెగావాట్ల అణువిద్యుదుత్పత్తి జరుగుతోందని, దాన్ని 22 వేల మెగావాట్లకు పెంచాలన్న కేంద్ర నిర్ణయం మానవ విధ్వంసానికి బాటలు వేస్తుందని విమర్శించారు. దానిని తయారు చేయాలన్నా ఖరీదుతో కూడుకున్న పనేనన్నారు. ఒక యూనిట్​ కరెంట్​ తయారు చేయడానికి ₹30 నుంచి ₹50 వరకు ఖర్చవుతుందని, మార్కెట్​లో మాత్రం ₹5 నుంచి ₹6కే దొరుకుతోందని అన్నారు. కాబట్టి అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆరోపించారు. సహజ సంపదను దోచుకునేందుకు మైనింగ్​ పేరుతో విధ్వంసానికి దిగుతున్నారని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి అన్నారు. గతంలో నాగార్జునసాగర్​ ప్రాంతంలోనూ ఆటమిక్​ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడడంతో వెనక్కు తగ్గారన్నారు.