బ్రిడ్జి కడితేనే ఓటేస్తం..లేకుంటే ఊర్లలోకి లీడర్లను, ఎలక్షన్​ డబ్బాలను రానివ్వం

బ్రిడ్జి కడితేనే ఓటేస్తం..లేకుంటే ఊర్లలోకి లీడర్లను, ఎలక్షన్​ డబ్బాలను రానివ్వం
  • 15 రోజుల్లో పూర్తి చేసి తీరాల్సిందే
  • ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామ ప్రజల వార్నింగ్
  • కలెక్టరేట్​ వరకు పాదయాత్ర.. ధర్నా 

ఆసిఫాబాద్, వెలుగు : దశాబ్దన్నర కాలంగా నిర్మాణ దశలోనే కొట్టుమిట్టాడుతున్న కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లాలోని గుండి వంతెన నిర్మాణం కోసం ఇక్కడి ప్రజలు సోమవారం రోడ్డెక్కారు. ప్రతి వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహించే పెద్ద వాగు దాటలేక తాము పడుతున్న అవస్థలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సుమారు 200 మంది గ్రామస్తులు పాదయాత్రగా ఊరి నుంచి కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ నినాదాలు చేస్తూ గంటపాటు ధర్నా చేశారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి మంజూరు చేయగా, నాటి ఆర్​అండ్​బీ మంత్రి జీవన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పాలకులు, అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. పిల్లర్ల దశలోనే ఉన్న ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలంటూ అనేకసార్లు గుండి గ్రామస్తులు ఆందోళనలు నిర్వహించారు. ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో సోమవారం మళ్లీ ఆందోళన బాట పట్టారు. వారు మాట్లాడుతూ 17 ఏండ్లగా గుండి వంతెన నిర్మాణంలోనే ఉందని, రూ.2 కోట్ల 80 లక్షలతో పనులు మొదలుపెట్టినా బిల్లులు సరిగ్గా చెల్లించకపోవడంతో ఇప్పటికే ముగ్గురు కాంట్రాక్టర్లు మారారని, అయినా పనులు మాత్రం పూర్తి కాలేదన్నారు.

 ప్రస్తుతం అంచనా వ్యయం రూ.20 కోట్లకు పెంచినా పనులు జరక్క 13 గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులు, గర్భిణులు దవాఖానకు వెళ్లలేని దుస్థితి ఉందని వాపోయారు. పిల్లల సదువులు సాగడం లేదన్నారు. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడే లీడర్లు హామీలిచ్చి పోతున్నారని, సమస్య పరిష్కరించడం లేదన్నారు. ఈ వంతెన పూర్తి చేస్తేనే రాజకీయ నాయకులను ఊర్లోకి రానిస్తామన్నారు. లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని, లీడర్లను రానిచ్చేది లేదన్నారు. ఊళ్లలోకి ఎలక్షన్ డబ్బాలు కూడా రానివ్వమని స్పష్టం చేశారు.  ఒకవేళ బలవంతంగా తీసుకురావాలని చూస్తే ధ్వంసం 
చేస్తామని హెచ్చరించారు.