
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కూకట్పల్లిలోని జేఎన్టీయూహెచ్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. సోమవారం వర్సిటీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ కన్వీనర్ రాజేశ్ కన్న మాట్లాడుతూ... వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలన్నారు.
జేఎన్టీయూహెచ్ పరిధిలో పలు కొత్త కాలేజీలు పెడుతున్నా, వాటిల్లో ఫ్యాకల్టీ లేరని, దీంతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వర్సిటీలో యూజీసీ, ఏఐటీసీఈటీ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి, 15–20 ఏండ్ల నుంచి పనిచేస్తున్నామని వివరించారు. టీచర్స్ డే సందర్భంగా రెగ్యులరైజ్ చేసే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.