Hyderabad: కరాచీ బేకరీ పుట్టుకపై వివాదం: అసలు విషయం బయటపెట్టిన ఓనర్స్

Hyderabad: కరాచీ బేకరీ పుట్టుకపై వివాదం: అసలు విషయం బయటపెట్టిన ఓనర్స్

Karachi Bakery: కరాచీ బేకరీ భారతదేశంలోని అనేక నగరాల్లో తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్-పాక్ యుద్ధం కొనసాగుతున్న వేళ అసలు కరాచీ బేకరీ బ్రాండ్ గురించి చాలా ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు ఈ బ్రాండ్ ఇండియాలో పుట్టిందా లేక దాయాది పాకిస్థాన్ దేశంలో పుట్టిందా అనే ప్రశ్న ఎదురైంది. ఎందుకంటే కరాచీ అనే పేరుతో పాకిస్థానులో ఒక నగరం కూడా ఉండటమే చాలా మందిని ఆలోచింపజేస్తోంది. 

అయితే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో తమ కస్టమర్లతో పాటు దేశప్రజలందరికీ తమ వ్యాపారం గురించి క్లారిటీ ఇవ్వాలని కరాచీ బేకరీ ఓనర్స్ నిర్ణయించారు. వాస్తవానికి ఈ సంస్థను హైదరాబాదులో స్థాపించినట్లు వారు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. తాము పూర్తిగా భారతీయ సంస్థని, తమ బ్రాండ్ 100 శాతం భారతదేశానికి చెందినదిగా వారు వెల్లడించారు. తాము 1953 నుంచి హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు అందులో వెల్లడించారు.

Also Read : యుద్ధంతోనూ భయపడని ఇన్వెస్టర్లు

కరాచీ బేకరీ అనే పేరు చరిత్ర నుంచి వచ్చిందని, కానీ అది తమ దేశానికి సంబంధించినది కాదని వెల్లడించారు. భారతదేశంలో ప్రారంభించబడిన సంస్థ ప్రేమతో భారతీయ కస్టమర్లకు సేవలను అందిస్తోందని కరాచీ బేకరీ ఓనర్స్ రాజేష్, హరీష్ రామ్నానీ స్పష్టం చేశారు. తమ తాతగారు ఖాన్చంద్ రామ్నానీ ఇండియా పాకిస్థాన్ విభజన సమయంలో ప్రస్తుతం పాకిస్థాన్ లోని కరాచీ నుంచి ఇండియాకు వచ్చి స్థిరపడ్డారని వారు వెల్లడించారు. అందువల్ల ఆ నగరం పేరును బేకరీ పేరుగా పెట్టుకున్నట్లు వారు వెల్లడించారు. 

 

దాదాపు 73 ఏళ్ల కిందట హైదరాబాద్ నగరంలో పుట్టిన కరాచీ బేకరీపై కొందరు వ్యక్తులు అది పాకిస్థాన్ లోని నగరం పేరు కలిగి ఉండటంతో దాడులు చేయటంపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, పోలీస్ కమిషనర్ తమకు అండగా నిలవాలని వారు కోరుతున్నారు. ఆందోళనకారులు బేకరీ పేరు మార్చుకోవాలని సూచిస్తున్న వేళ తమకు మద్ధతుగా నిలవాలని యజమానులు కోరారు. ఇటీవల విశాఖలోని తమ బేకరీపై కూడా ఇలాంటి దాడే జరిగినట్లు యజమానులు పేర్కొన్నారు.