గూడుకట్టిన అసహనమే..అగ్నిపథమైంది!.

గూడుకట్టిన అసహనమే..అగ్నిపథమైంది!.

అగ్నిపథ్ పథకం ప్రకటనతో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. అవి హింసాత్మకంగా పరిణమించడం, సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ లో కూడా సైనిక అభ్యర్థుల ఆగ్రహ ప్రదర్శన, రైల్వే పోలీసుల కాల్పులు వంటి పరిణామాలు పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ విషయంలో సంపూర్ణ వివరాలతో వస్తుగతమైన, సమగ్రమైన చర్చ కన్న ఎక్కువగా, ఆయా వ్యాఖ్యాతల ముందస్తు అభిప్రాయాల మీద ఆధారపడిన రచ్చ మాత్రమే జరుగుతున్నది. అగ్నిపథ్ పథకం సైన్యంలో చేరదలుచుకున్నవారికీ, సైనిక బలగాలకూ, దేశానికీ ఎంత మంచిదో కొందరు చెబుతున్నారు. ఆ పథకం సైనిక ఉద్యోగార్థుల్లో ఎంతటి అనిశ్చితికి దారి తీస్తుందో, అందువల్ల వారు సైన్యంలో ఉన్న నాలుగేండ్లు కూడా నిబద్ధతా స్థాయి ఎంత తక్కువగా ఉండే అవకాశం ఉందో, ఆ నాలుగేండ్ల తర్వాత వారి జీవనస్థితి ఎంత సంశయాత్మకంగా ఉంటుందో మరికొందరు చెబుతున్నారు. ఈ నాలుగేండ్లలో వారు బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించడం వంటి నైపుణ్యాలు నేర్చుకుంటారు గనుక స్వయం ఉపాధి చూసుకోవచ్చునని ఒకరు, తమ పార్టీ కార్యాలయాల కాపలాదార్ల నియామకంలో వారికి ప్రాధాన్యం ఇస్తామని ఇంకొకరు హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఆందోళనలను మరింత జటిలం చేశారు. 

ప్రభుత్వ చర్య సరైనదేనా?
అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ సైనిక అభ్యర్థుల నిరసన అనేక రాష్ట్రాల్లో హింసాకాండకు దారి తీయడం మీద కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ప్రస్తుత ఆందోళన ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహానికి ప్రతిస్పందన. మూడేండ్ల కింద ప్రారంభమై, ఇంకా కొనసాగుతున్న ఒక నియామక ప్రక్రియను హఠాత్తుగా ఆపేసి, అవే ఉద్యోగాలకు కొత్త నియామక ప్రక్రియను ప్రకటించడం తప్పనిసరిగా తప్పే. ఆ అభ్యర్థులకు ఆగ్రహం కలిగిందంటే, వాళ్లు ఇప్పటికే ఆ ప్రక్రియలో రెండు మూడు జల్లెడలు దాటి, చివరి జల్లెడ  కోసం ఎదురుచూస్తున్నప్పుడు, అసలు నియామక ప్రక్రియనే రద్దు చేయడం వల్లనే. అది ప్రభుత్వం చేసిన ఒప్పంద ఉల్లంఘన. అది కచ్చితంగా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. ఆ చర్యకు ప్రతిచర్యగా అభ్యర్థులు ప్రకటించిన నిరసన తప్పొప్పులను చర్చించే ముందు ఆ చర్య ఉచితమో కాదో చర్చించాల్సి ఉంది. కొత్తగా మొదలు కాబోయే ప్రక్రియలో ఈ అభ్యర్థులు మళ్లీ చేరినా, లేక కొత్త అభ్యర్థులే వచ్చినా రానున్న సైనిక ఉద్యోగాలకు ఎంతమాత్రం జీవన భద్రత లేదు. మొదటి సమస్య, ఈ ప్రక్రియలో నాలుగున్నరేండ్ల తర్వాత 25 శాతం మందికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. మిగిలినవాళ్లు రూ.10 లక్షలతో ఇంటికి రావాల్సిందే. తిరిగి వచ్చిన వారికి పెన్షన్ ఉండదు, క్యాంటీన్ సౌకర్యం వంటి వసతులేవీ దక్కవు. అంటే ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్నవాళ్లు నాలుగేండ్ల తర్వాత మళ్లీ నిరుద్యోగులు కావడం మినహా జరగబోయేది లేదు. ప్రభుత్వానికి మాత్రం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత నుంచీ, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత నుంచీ వెసులుబాటు కలుగుతుంది.

రిజర్వేషన్లు ఉన్నా.. ఫలితమేది?
మాజీ సైనికోద్యోగులుగా ఇతర ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్ కల్పిస్తామని పాలకులు వాగ్దానం చేస్తున్నారు గానీ, అన్ని వాగ్దానాల లాగానే ఇది కూడా అమలు జరిగేలా లేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో గ్రూప్ సి ఉద్యోగాల్లో 14.5 శాతం, గ్రూప్ డి ఉద్యోగాల్లో 24.5 శాతం మాజీ సైనికోద్యోగులకు రిజర్వేషన్​ కోటా ఉన్నప్పటికీ, వాటిల్లో భర్తీ అయిన వారి సంఖ్య గ్రూప్ సి లో 1.15 శాతం, గ్రూప్ డి లో 0.3 శాతం మాత్రమే ఉందని సైనిక పునరావాస డైరెక్టర్ జనరల్ కార్యాలయ తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి స్వల్ప వ్యవధి సైనిక శిక్షణా ఉద్యోగాలు ఉన్నాయని, తాము అదే అనుసరిస్తున్నామని, ఈ పద్ధతి దేశానికి మేలు చేస్తుందని ప్రభుత్వం చెబుతున్నది. కానీ నిరుద్యోగ స్థాయిలో, విద్యా ఉద్యోగావకాశాల విషయంలో, ఏ ఉద్యోగానికైనా ఉండే గౌరవం విషయంలో ఆ దేశాలకూ భారతదేశానికీ పోలికే లేదు. అక్కడ నిరుద్యోగం మన స్థాయిలో లేదు, అక్కడ సైన్యంలో పని చేసి వచ్చాక చదువుకోవచ్చు, ఏదైనా ఉద్యోగంలో, వృత్తిలో స్థిరపడవచ్చు. మన దేశంలో విపరీతమైన నిరుద్యోగం వల్ల, సైనిక, అర్ధ సైనిక, పోలీసు ఉద్యోగాలు తప్ప ఇతర ఉద్యోగ కల్పన క్షీణిస్తుండటం వల్ల నిరుద్యోగులందరూ, ఉద్యోగార్థులందరూ ఈ ఉద్యోగాల వైపు చూస్తున్నారు. వీటిల్లో కూడా ఉద్యోగ భద్రత తొలగిస్తే, ఉద్యోగానంతర సౌకర్యాలను రద్దు చేస్తే నిరుద్యోగులకు దిక్కు లేని స్థితి ఏర్పడుతుంది.

ఉద్యోగ ప్రకటనలు సంతృప్తి పరుస్తయా?
ఎప్పటికప్పుడు ఉద్యోగ నియామకాల ప్రకటనలు, సినిమా, క్రీడలు, కుల మత సమీకరణలు, సెల్ ఫోన్, పోర్నోగ్రఫీ వంటి ఎన్ని మార్గాల్లో మళ్లించడానికి ప్రయత్నించినా ఆ అసంతృప్తీ, మానసికాందోళనా ఆ సమయానికి కాస్త తగ్గుతాయేమో గానీ, నిజమైన జీవన సమస్యల ప్రేరణలు కలిగినప్పుడు భగ్గున మండుతాయి. ఉద్యోగ నియామకాల ప్రకటనలు గంతలు కట్టిన గుర్రం ముందర వేలాడదీసిన మేత లాగ, ఉపశమనంగా కనిపించవచ్చునేమో గానీ ఆ వాగ్దానాలు ఎప్పటికప్పుడు నిజం కాకపోతే మరిన్ని సమస్యలకు దారి తీస్తాయి. ఒక ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడుతున్న సందర్భంలో, ఆ ప్రకటనలతో కోచింగ్ సంస్థలు, పోటీ పరీక్షల పుస్తకాల ప్రచురణ సంస్థలు లాభపడ్డంతగా అభ్యర్థులకు సంతృప్తి కలగదు. ఉద్యోగ నియామకాల ప్రకటనలు నిరుద్యోగుల్లో అశాంతిని పెంచుతాయనడానికి తెలంగాణలో గత ఎనిమిదేండ్ల అనుభవమే నిదర్శనం. కాబట్టి తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రస్తుత ఉద్యోగ ప్రక్రియ గురించో, హింసాకాండ గురించో కాదు. మన విలువైన, శక్తిమంతమైన యువతరాన్ని ఇంత తీవ్రమైన అశాంతికీ, ఒత్తిడికీ, మానసికాందోళనకూ గురి చేస్తే, దాని దీర్ఘకాలిక ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆలోచించాలి. రెండో ప్రపంచ యుద్ధానంతరం రేకెత్తిన ఆశలు వమ్మయిపోగా, రెండు దశాబ్దాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కోపోద్రిక్త యువతరం లేచి నిలిచి, ఆంగ్రీ సిక్స్టీస్ అని పేరు పొందిన ఆగ్రహ దశాబ్దానికి దారితీసింది. లాటిన్ అమెరికా నుంచి ఆగ్నేయాసియా దాకా, ప్రాన్స్ నుంచి శ్రీలంక, భారతదేశాల దాకా 1960లలో అసంఖ్యాక యువతరం తిరుగుబాట్లకు పురికొల్పినది ఆ అసంతృప్త మానసిక స్థితే. అటువంటి మానసిక స్థితే 2020లలో పేరుకుపోతుండటమే తీవ్రంగా ఆలోచించాల్సిన పరిణామం. 

మరో కోణంలో ఆలోచించాలి
ఈ సమకాలిక పరిణామాల గురించి ఎంత వివరంగానైనా, లోతుగానైనా చర్చించవచ్చు గానీ వాస్తవానికి వాటి వెనుక ఉన్న మరో కోణం గురించి ఆలోచించాల్సి ఉంది. ఈ పరిణామాలు దేశంలో నెలకొన్న దుర్భరమైన నిరుద్యోగ స్థితిని చూపడం మాత్రమే కాదు, యువతరంలో పెరిగిపోతున్న నిరాశా నిస్పృహలకు అద్దం పడుతున్నాయి. భారత జనాభా సగటు వయసు 28 ఏండ్లనీ, అంటే మొత్తం జనాభాలో 35 కన్న తక్కువ వయసు ఉన్నవారు 65 శాతం ఉన్నారనీ, పని చేయగల జనాభా మొత్తం జనాభాలో 62.5 శాతం ఉందనీ, ఇది జనాభా సదవకాశం (డెమోగ్రఫిక్ డివిడెండ్) అనీ దశాబ్ద కాలంగా చర్చ జరుగుతున్నది. కానీ ఈ స్థితిని జనాభా సదవకాశంగా మలచుకోవాలంటే పని చేయగల వయసు వారందరికీ పని దొరకాలి. ఉద్యోగమో, వృత్తో, స్వయం ఉపాధో దొరకాలి. గణనీయమైన భాగానికి అవి దొరకనప్పుడు ఆ జనాభాలో మొదట నిరాశా నిస్పృహలు వ్యాపిస్తాయి. ఆ అశాంతి విస్ఫోటక శక్తిగా మారుతుంది. ముఖ్యంగా 18 నుంచి 30 ఉడుకు నెత్తురు వయోబృందానికి విద్యా, ఉద్యోగావకాశాలు తగ్గిపోయినప్పుడు కలిగే ఒత్తిడి, మానసికాందోళన విపరీతమైన అశాంతిని, అసంతృప్తిని కలిగిస్తాయి. ఈ యువతరం నిర్మాణాత్మక వృత్తి, ఉద్యోగాల్లో చేరే అవకాశం లేకపోతే, తప్పనిసరిగా వారి శక్తి సామర్థ్యాలు ఇతర మార్గాల్లో పెల్లుబుకుతాయి.