జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లి మండలంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని నిజాంపేట్ జేఏసీ నాయకుడు ఆకుల సతీశ్, స్థానికులు డిమాండ్చేశారు. శనివారం తహసీల్దార్ఆఫీస్ఎదుట నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.వేల కోట్ల విలువైన సర్కారు భూములు పరాధీనమయ్యే ప్రమాదం ఉందన్నారు. నిజాంపేట్ సర్వే నంబర్ 325లో ఉన్న రూ.600 కోట్ల విలువైన సుమారు 14 ఎకరాల ప్రభుత్వ భూమి కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని చెప్పారు.
అలాగే, సర్వే నంబర్ 233/23 నుంచి 223/26 వరకు రూ.500 కోట్ల విలువ చేసే 12 ఎకరాల ప్రభుత్వ భూమి కేసులో ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో తీర్పులు వెలువడి నెలలు గడుస్తున్నా రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు అప్పీల్ పిటిషన్లు వేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 454లో ప్రభుత్వ భూమి, చెరువును బీఆర్ఎస్కు చెందిన ఓ నాయకుడు ఆక్రమించాడని, చర్యలు తీసుకోవాలని కోరారు.
