ప్రొటోకాల్ రగడ..బీఆర్ఎస్, బీజేపీ వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత

ప్రొటోకాల్ రగడ..బీఆర్ఎస్, బీజేపీ వర్గాల ఘర్షణతో ఉద్రిక్తత
  • ఎల్​బీనగర్​ ఎమ్మెల్యేను సోషల్ మీడియాలో ప్రశ్నించిన బీజేపీ కార్పొరేటర్ మధుసూదన్
  • ఆయన ఇంటిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి 
  • ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత
  • అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు

ఎల్​బీనగర్, వెలుగు: బీఆర్ ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. ఎల్ బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చంపాపేట్​ బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అభివృద్ధి ప్రారంభోత్సవాల్లో తమ పార్టీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి గురువారం ఆయనను ఉద్దేశించి సోషల్ మీడియాలో దూషించారు.

దీంతో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం కార్పొరేటర్ ఇంటిపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరువర్గాల నేతలు మధ్య ఘర్షణ జరిగి దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్ కు మద్దతుగా వచ్చిన స్థానిక మహిళ పుస్తెల తాడు తెగింది. పోలీసులు భారీగా చేరుకొని అడ్డుకున్నారు. 

అనంతరం ఎమ్మెల్యే తీరును  నిరసిస్తూ కర్మన్ ఘాట్ చౌరస్తాలో బీజేపీ నేతలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని కార్పొరేటర్ ను, బీజేపి శ్రేణులను అరెస్ట్ చేసి వేర్వేరు పీఎస్ లకు తరలించారు. కార్పొరేటర్ కు  మద్దతుగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి  వచ్చి మద్దతు తెలిపారు.

బీఆర్ఎస్​ను బొందపెట్టుడు ఖాయం

ఇబ్రహీంపట్నం: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ను బొందపెట్టడం ఖాయమని కార్పొరేటర్​వంగ మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి వర్సెస్ కార్పొరేటర్ మధ్య ప్రొటోకాల్ వివాదం నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పీఎస్ కు తరలించారు. అక్కడికి భారీగా బీజేపి శ్రేణులు చేరుకొని మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా మధుసూదన్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలను, విపక్ష నేతలను భయబ్రాంతులకు గురిచేస్తూ.. ఆపై దాడి చేసి లబ్ధి పొందాలనే దురాలోచనతో శాంతిభద్రతలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.  

ప్రతిపక్ష సభ్యులపై దాడిచేసి ఎల్ బీనగర్ ఎమ్మెల్యే గెలవాలని కుట్రపన్నుతున్నాడని ఆరోపించారు. తన నియోజవర్గంలో దళిత, గిరిజనులపై అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఇవేవి పట్టించుకోకుండా ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి తన వాళ్లకు వత్తాసు పలుకుతున్నాడని విమర్శించారు.