దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఓ వైపు స్కిల్ డెవలప్​మెంట్ చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని పింగళి వెంకట్రామిరెడ్డి హాల్​లో మంగళవారం నిర్వహించిన రోజ్ గార్ మేళాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జాతీయ బ్యాంకులు, డీఆర్డీవో, ఇండియన్ రైల్వే, డిఫెన్స్, హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహా మొత్తం 22 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 470 మందికి అపాయింట్​మెంట్ లెటర్లు అందజేసి మాట్లాడారు. 

ఉద్యోగాలు వచ్చినవాళ్లు అంకితభావంతో దేశం కోసం పనిచేయాలని, తల్లిదండ్రులను మరిచిపోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్నామన్నారు. 2022, అక్టోబర్ 22న దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధాని మోడీ ప్రారంభించారని గుర్తుచేశారు. మొత్తం 4.30 లక్షల మంది యువతకు ఉద్యోగాలిచ్చామన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేయడం ఇదే ఫస్ట్​టైం అని తెలిపారు. 

యూత్ పాపులేషన్​లో మనమే నెంబర్ వన్

యూత్ పాపులేషన్​లో ప్రపంచంలోనే ఇండియా నంబర్ వన్ స్థానంలో ఉందని కిషన్​రెడ్డి అన్నారు. ఎన్నో అంతర్జాతీయ, సాఫ్ట్​వేర్ కంపెనీలకు సీఈవోలుగా ఇండియన్సే ఉన్నారని, యువత శక్తిని తక్కువ అంచనా వేయొద్దన్నారు. వారిలోని శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని ప్రపంచాన్ని శాసించేలా ఇండియాను తయారు చేయాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే ఇండియా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇండియాలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో వాణిజ్య ఎగుమతులు 2021–22లో 418 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు. 2014కు ముందు దేశంలో 74 ఎయిర్​పోర్టులు ఉంటే ఇప్పుడు 150కి చేరాయన్నారు. 2025 నాటికి 225 విమానాశ్రయాలు సేవలు అందిస్తాయని తెలిపారు.