స్పౌజ్ ​బదిలీలు చేపట్టండి

స్పౌజ్ ​బదిలీలు చేపట్టండి

హైదరాబాద్, వెలుగు :  స్పౌజ్​బదిలీల ద్వారా 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని పీఆర్ టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్​రెడ్డి, పర్వతి సత్యనారాయణ కోరారు. నిరుడు సెప్టెంబర్​లో బదిలీలు జరిగినా ఇంకా పలువురు టీచర్లు రిలీవ్​ కాలేదని, వారిని రిలీవ్​ చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం వారు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతి పత్రం అందించారు. మోడల్​స్కూల్స్​టీచర్ల బదిలీలను చేపట్టాలన్నారు. ఎన్నికల కోడ్​తో నిలిచిపోయిన జోన్ 2 పదోన్నతులను వెంటనే చేపట్టాలని.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రిటైర్​అయిన వారికి పదోన్నతి అవకాశం కల్పించి ఆ హోదాపైనే రిటైర్​అయినట్టు పేర్కొనాలని కోరారు. 2010 కన్నా ముందు నియమితులైన వారికి టెట్​నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యా సంవత్సరానికి ముందే భాషా పండితులు, పీఈటీల అప్ గ్రేడేషన్​ను చేపట్టాలని, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కేర్​టేకర్లను నియమించాలని కోరారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్​ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

బ్లైండ్​టీచర్స్​ సమస్యలు పరిష్కరించండి

దృష్టి లోపంతో బాధపడుతున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని బ్లైండ్ ఎంప్లాయిస్​అసోసియేషన్​తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాఘవేందర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన నేతృత్వంలో బ్లైండ్​ఎంప్లాయిస్​ అసోసియేషన్​ ప్రతినిధులు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతి పత్రం అందించారు. దృష్టి లోపంతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు లాంగ్ స్టాండింగ్ తో సంబంధం లేకుండా.. వారు కోరుకున్న ప్లేస్​లోనే కొనసాగించాలని కోరారు. ఉద్యోగి కోరుకున్నట్టయితే సర్వీస్​తో సంబంధం లేకుండా బదిలీకి అవకాశం కల్పించాలన్నారు. ఈ టీచర్లకు ఐరిస్​అటెండెన్స్​నుంచి మినహాయింపునివ్వాలని విన్నవించారు.