పీఆర్సీ వేయాలి... పీఆర్టీయూటీ డిమాండ్

పీఆర్సీ వేయాలి...	పీఆర్టీయూటీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: వెంటనే పీఆర్సీ వేసి ఐఆర్​ ప్రకటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ(పీఆర్​టీయూటీ) డిమాండ్​ చేసింది. బదిలీలపై కోర్టు కేసు ఉన్నందున పదోన్నతుల ప్రక్రియను వారంలోపు ప్రకటించాలని డిమాండ్​ చేసింది. ఆదివారం హైదరాబాద్​లో పీఆర్టీయూటీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎం. చెన్నయ్య అధ్యక్షతన నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్​ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో.. పీఆర్సీ, పదోన్నతులు సహా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. 23 ఏండ్లుగా ప్రమోషన్లకు నోచుకోని పండిట్​లు, పీఈటీలను అప్​గ్రేడ్​ చేయాలని నేతలు తీర్మానించారు. సీపీఎస్​ అమలు కాకముందే 2003 డీఎస్సీ టీచర్ల రిక్రూట్​మెంట్​ జరిగిందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి పాత పింఛన్​ విధానాన్నే అమలు చేయాలని వారు డిమాండ్​ చేశారు. కొత్త ఈహెచ్ఎస్​ పాలసీని వెంటనే ప్రకటించాలని, ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని, పెండింగ్​ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.