పిల్లల పుస్తకాలకు ‘బ్రౌన్ పేపర్’ వేస్తున్నారా ? దీని వెనుక ఉన్న అసలు సైకాలజీ ఇదే!

 పిల్లల పుస్తకాలకు ‘బ్రౌన్ పేపర్’ వేస్తున్నారా ? దీని వెనుక ఉన్న అసలు సైకాలజీ ఇదే!

ప్రతి ఏడాది స్కూళ్లు ఓపెన్ చేసే సమయంలో తల్లిదండ్రులకు ఒక రొటీన్ పని మొదలవుతుంది. కొత్త నోట్‌బుక్స్, టెక్స్ట్‌బుక్స్ కొనడం, ఫస్ట్ పేజీలో పిల్లల పేర్లు రాయడం, వాటికీ  జాగ్రత్తగా గోధుమ రంగు పేపర్ కవర్లు వేయడం. ఈ రోజుల్లో ప్లాస్టిక్ కవర్లు, డిజిటల్ మెటీరియల్స్, రెడీమేడ్ బుక్ కవర్లు అందుబాటులోకి వచ్చినా, డిజిటల్ యుగంలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ 'బ్రౌన్ పేపర్' సంప్రదాయాన్ని వదలడం లేదు. అసలు తల్లిదండ్రులు ఇప్పటికీ ఎందుకు ఈ పని చేస్తున్నారు ? దీని వెనుక ఉన్న మానసిక కోణాలు  ఏంటో ఇప్పుడు చూద్దాం.

 సెన్స్ ఆఫ్ కంట్రోల్ 
కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందంటే పిల్లలకే కాదు, తల్లిదండ్రులకు కూడా కాస్త కంగారుగానే ఉంటుంది. పిల్లలు కొత్త క్లాస్‌లో ఎలా చదువుతారు ? కొత్త టీచర్లతో కలవగలుగుతారా ? మంచి స్నేహితులు దొరుకుతారా ? ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులకు ఎలాంటి కంట్రోల్ ఉండదు. కానీ, వాళ్ళ పిల్లల పుస్తకాలకు నీట్‌గా కవర్ వేసి, లేబుల్ అంటించి రెడీ  చేయడం అనేది వారి చేతుల్లో ఉండే పని. ఈ చిన్న పని  వారికి "మేము అంతా రెడీ చేశాం, అంతా బాగానే జరుగుతుంది" అనే ఒక రకమైన మానసిక ప్రశాంత, నమ్మకాన్ని ఇస్తుంది.

 మాటల్లో చెప్పలేని 'ప్రేమ, ఆప్యాయత'  
చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై వారికీ ఉన్న ప్రేమను మాటల్లో కంటే చేతల్లోనే ఎక్కువగా చూపిస్తుంటారు. ప్రతి పుస్తకానికి శ్రద్ధగా కవర్ వేయడం, చిరిగిపోకుండా మూలలను గట్టిగా మడవడం, పేరు లేబుల్ సరిగ్గా అంటించడం... ఇవన్నీ పిల్లల చదువు పట్ల, వారి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు చూపించే ప్రేమకు, బాధ్యతకు నిదర్శనాలు.

తీపి జ్ఞాపకాలు & బంధాలు 
చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన పుస్తకాలకు ఎలాగైతే బ్రౌన్ పేపర్ వేశారో, ఇప్పుడు మనం కూడా మన పిల్లలకు అదే విధంగా చేయడం వల్ల ఒక తరం నుండి మరొక తరానికి బంధం కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది తల్లిదండ్రులకు వాళ్ళ స్వంత చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. పిల్లలతో గడిపే ఈ సమయం వారికి ఒక తీపి అనుభూతిగా మారుతుంది.

 కేవలం ఆచరణాత్మకమైన కారణాలు  
దీని వెనుక సైకాలజీ మాత్రమే కాకుండా చాలా సాధారణ కారణాలు కూడా ఉన్నాయి.  బ్రౌన్ పేపర్ చాలా తక్కువ ఖర్చుతో దొరుకుతుంది. ఇంకా  పుస్తకాలు నలిగిపోకుండా, మురికి కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. పుస్తకాలను శుభ్రంగా ఉంచుకోవడం పిల్లలకు ఒక మంచి అలవాటుగా మారుతుంది.

 ఒకరికి ఇది కేవలం పుస్తకాలను జాగ్రత్త ఉంచుకునే  మార్గం కావచ్చు, మరొకరికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మధురమైన అనుభూతి కావచ్చు, ఇంకొకరికి పిల్లలపై ఉన్న బాధ్యత ఇంకా ప్రేమ. పైకి సాధారణంగా కనిపించే ఈ చిన్న పని వెనుక కుటుంబాల్లో ఒక అందమైన క్రమశిక్షణ, సంరక్షణ, అనుబంధం దాగి ఉన్నాయి.