ప్లాట్ అమ్మాలన్నా.. కొనాలన్నా పిటిఐన్ ఉండాల్సిందే

ప్లాట్ అమ్మాలన్నా.. కొనాలన్నా పిటిఐన్ ఉండాల్సిందే

పీటీఐఎన్ ఉంటేనే అమ్ముడు.. కొనుడు

రిజిస్ట్రేషన్​కు మస్ట్​ కావడంతో పరేషాన్​లో జనం

బిల్డింగ్ లు, ఫ్లాట్లు, ఇళ్లు అమ్మలేని పరిస్థితి

కొన్నేళ్లుగా నిర్మించినా పట్టించుకోని అధికారులు

తప్పంతా ఇప్పుడు జనంపైనే వేసేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: సిటీలో బిల్డింగ్ లు, ఇళ్లు నిర్మించాలనుకుంటే కొన్ని పర్మిషన్ రూల్స్ ఉన్నాయి. 200 గజాలలోపు జాగాలో జీ+2 నిర్మాణమే కట్టుకోవాలి. కానీ ఎక్కడ చూసినా 200 గజాల జాగాల్లో జీ +5, 6 వరకు అంతస్తులు కనిపిస్తయ్. రూల్స్​ ప్రకారం నిర్మాణాలు ఎక్కడా లేవు. ఇచ్చిన అనుమతి కన్నా ఎక్కువ ఫ్లోర్లనే కట్టేశారు. అపార్ట్ మెంట్లు, ఇళ్లు నిర్మించినా పేపర్​లోనే  పర్మిషన్ ఉంటుంది. కానీ  కట్టే నిర్మాణాలు వేరేగా ఉంటాయి. ఇలా కట్టిన వాటికి అధికారులు లంచాలు తీసుకొని, చూసిచూడనట్లు, పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో పెద్ద ఎత్తున బిల్డర్లు పర్మిషన్ లేని ఫ్లోర్లను కట్టేసి, వాటిని చాలా మందికి అమ్మేశారు కూడా. ఇదంతా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు మాత్రం తప్పు మొత్తం జనంపైనే  వేసేసింది. ఫ్లాటు, బిల్డింగ్ లు అమ్మాలంటే పిటిఐఎన్ ( ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్) కు లింక్ పెట్టేసింది. నంబర్ కావాలంటే పర్మిషన్ పేపర్ లో ఎన్ని ఫ్లోర్లకు అనుమతించారో దానికి మాత్రమే ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ ఇస్తారు. దీంతో పర్మిషన్ కు మించి కట్టిన వారు, అది తెలియక ఫ్లాట్లు కొన్న లక్షలాది మంది ఇప్పుడు ఆగమవుతున్నారు.

అమ్ముకోలేని పరిస్థితి

కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పీటీఐఎన్ నంబర్ కారణంగా చాలా మంది బిల్డర్లు, అపార్ట్ మెంట్ల వాళ్ల ఫ్లాట్లు కొనలేని పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చేయాలంటే పీటీఐఎన్ నంబర్ కంపల్సరీ అని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి… సిటీ శివారుల్లో స్టాండ్ లోన్ అపార్టుమెంట్ నిర్మించారు. 200 గజాల్లో ఉన్న ఆ బిల్డింగ్ కు రూల్స్​ ప్రకారం జీ+2 మాత్రమే పర్మిషన్లు ఉంటాయి. అధికారుల సపోర్ట్​తో జీ+4 నిర్మాణం చేసి ప్రతి ఫ్లోర్ కు రెండు ఫ్లాట్ల చొప్పున ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఏడాది క్రితమే నిర్మించి, మార్కెట్ లో అమ్మకం  మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ విధానంతో ఆ ఫ్లాట్లు అమ్ముడు పోయే పరిస్థితి లేదు. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం ఫ్లాట్లు అమ్ముకుందామనుకునే వారికి కూడా పీటీఐఎన్ నంబర్ అడ్డుగా మారింది.

అప్లై చేసుకునేందుకు వస్తలే

పర్మిషన్ ప్రకారం ఇళ్లు ఉన్న వాళ్లు పీటీఐఎన్ నంబర్ కావాలంటే ఆన్​లైన్​లో అప్లయ్ చేసుకుంటే రెండు రోజుల్లో ఇస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ దరఖాస్తు చేసుకుందుకు ఎవరూ రావడం లేదు. ఎన్నడో కొన్న బిల్డింగ్ లకు, ఫ్లాట్లకు కొత్తగా పీటీఐఎన్ నంబర్ కోసం అప్లయ్ చేసుకోవడం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం బీఆర్ఎస్ కొర్రీ పెట్టింది. పీటీఐఎన్ నంబర్ లేని వాళ్లు బీఆర్ఎస్ చేయించుకున్న తర్వాతే అమ్మటానికి, కొనటానికి వీలు ఉంటుంది. ఎల్ఆర్ఎస్ లేకుంటే ఖాళీ జాగాలు కూడా అమ్మటం వీలు కాదు.  అదే విధంగా బీఆర్ఎస్ లేకుంటే సిటీలో ఫ్లాట్లు, బిల్డింగ్ లు అమ్ముకోలేరు.  బీఆర్ఎస్ కు లక్షల్లో ఫీజులు ఉండగా బిల్డర్లు, జనం పరేషాన్​అవుతున్నారు. మొత్తానికి ఈ పీటీఐఎన్ తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తలనొప్పిగా మారింది.

వేలల్లో బాధితులు

సిటీలో పీటీఐఎన్ నంబర్ లేని వారు వేలల్లో ఉన్నారు. దశాబ్దాలుగా పీటీఐఎన్ నంబర్ లేకుండానే పర్మిషన్ ఇచ్చిన దాని కన్నా ఎక్కువ ఫోర్లు, ఫ్లాట్లు నిర్మించినా వాటిని రిజిస్ట్రేషన్ చేసేశారు.  కొన్ని వేల కొత్త బిల్డింగులు  ఇలాగే నిర్మాణం అయ్యాయి. హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలనుకున్న చాలా మంది ఇలాంటి పర్మిషన్ లేని ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇక అధికారులు పట్టించుకోవటం లేదన్న కారణంతో భారీగా భవనాలు నిర్మించేశారు. అలాంటి ఇళ్లకు పీటీఐఎన్ నంబర్ ఇవ్వటం లేదు.  ప్రాపర్టీ ట్యాక్స్​కడుతున్న వారిలోనూ చాలా మందికి ఈ పీటీఐఎన్ నంబర్ తీసుకోవాలన్న అవగాహన లేదు.

For More News..

సీక్రెట్​ ఆపరేషన్​తో చైనా సైన్యానికి షాక్

రెండేండ్ల దాకా 25 శాతం జనానికి వ్యాక్సిన్ డౌటే!

కేటీఆర్‌‌‌‌ను సీఎం చేయడమే కేసీఆర్‌‌‌‌ లక్ష్యం