
వెలుగు, నెట్వర్క్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం ప్రజాపాలన, తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. పల్లెలు, పట్టణాలు మండల కేంద్రాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ముందుగా తెలంగాణ తల్లి, ప్రొపెసర్ జయశంకర్ ఫొటోలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. నిజామాబాద్లో వేం నరేందర్రెడ్డి, కామారెడ్డిలో కొదండ రెడ్డి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రెండు జిల్లాల కలెక్టరేట్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పలు రాజకీయ పార్టీల ఆఫీస్లు, ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిని వివరించారు. తెలంగాణ విముక్తి కోసం ఆనాడు రజకార్లతో చేసిన పోరాటాలను గుర్తుచేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.
48 గంటల్లోనే పథకాల అమలు : సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి
నిజామాబాద్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ సర్కార్ ముందంజలో ఉందని, సీఎం రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టామని సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల అవసరాలపై దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నామన్నారు.
సుపరిపాలనతో మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. జిల్లాలో 97,696 మంది రైతుల పంట రుణాలు రూ.755.29 కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద వానాకాలం పంట పెట్టుబడిగా రూ.316 కోట్లు అందజేశామన్నారు. రైతు బీమా పథకం ద్వారా 966 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. 18,155 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో వంటగ్యాస్ సబ్సిడీ కింద ఇప్పటి వరకు రూ.30.73 కోట్లు ప్రభుత్వం భరించిందని తెలిపారు. గత వానాకాలం, యాసంగి వడ్ల కొనుగోళ్లతో నిజామాబాద్జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జీరో కరెంట్ బిల్లుల కింద పేదల తరఫున రూ.174 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. మహిళల ఫ్రీ జర్నీ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 6.30 కోట్ల టికెట్లపై రూ.260 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచినట్టు చెప్పారు.
రూ.485 కోట్ల విలువైన పరిశ్రమలను స్థాపించి 6,662 మందికి ఉపాధి కల్పించామని వివరించారు. హార్టికల్చర్, ఆయిల్ పామ్ పంటలకు తగిన ప్రోత్సాహం ఇస్తోందని తెలిపారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌లు మానాల మోహన్ రెడ్డి, తాహెర్, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశవేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి దిశగా కామారెడ్డి జిల్లా : రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
కామారెడ్డి, వెలుగు: ప్రగతి దిశగా కామారెడ్డి జిల్లా పయనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. బుధవారం ప్రజా పాలన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తెలంగాణ కీర్తి గాంచిందన్నారు.
గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కామారెడ్డి జిల్లా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ముందుకెళ్తోందని చెప్పారు. ఇటీవల జిల్లాలో వరదల సమయంలో చిక్కుకున్న వారిని కాపాడామని, 28,615 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదించామని వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, అడిషనల్కలెక్టర్ చందర్ నాయక్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, జిల్లా లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆయా పార్టీ కార్యాలయాల్లో..
బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు జాతీయ జెండాను ఎగురవేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఆయా నాయకులు జాతీయ జెండా ఎగురవేశారు. సర్దార్ వల్లభబాయి పటేల్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జడ్పీ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర జాతీయ జెండాలను ఆవిష్కరించారు.