- ఖమ్మంకు చెందిన డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రజాచైతన్య యాత్ర
- ఇప్పటికే 200 గ్రామాల్లో యాత్ర పూర్తి
ఖమ్మం, వెలుగు : ‘మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం.. రాజ్యాంగ విశిష్టతను ప్రజలకు అర్థమయ్యేలా చెబుదాం’.. అంటూ ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే, మరో వైపు సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నారు. యువతతో పాటు ప్రజలకు రాజ్యాంగం అందించే లాభాలు, హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం భారత రాజ్యాంగ పరిరక్షణ సమితిని సైతం ఏర్పాటు చేశారు.
ఈ సమితి ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 15న ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలోని 11 మండలాల్లో 200 గ్రామాల్లో సాగింది. యాత్రలో భాగంగా అందరితో రాజ్యాంగ పీఠికను చదివిస్తూ.. రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేయిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇటీవల నిలిచిపోయిన యాత్రను త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు గోపీనాథ్ చర్యలు చేపట్టారు.
ఖమ్మం జిల్లాలోని మిగిలిన మండలాల్లో యాత్రను పూర్తి చేశాక.. మిగతా జిల్లాల్లో సైతం యాత్రను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాత్రలో రాజ్యాంగ రక్షణ సమితి సభ్యుడు, రిటైర్డ్ హెడ్‌మాస్టర్ సీహెచ్.కనకయ్య, సింగరేణి మైనింగ్ రిటైర్డ్ ఉద్యోగి మంకెన లక్ష్మీపతి, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు తెలగనుల్ల గోపాల్, న్యాయవాది శ్రీనివాస్ పాల్గొంటున్నారు.
అన్ని రాజ్యాంగ వ్యవస్థలు కబ్జా : ఎంఎఫ్.గోపీనాథ్
రాజ్యాంగం ఇచ్చిన ఓటు, విద్యాహక్కు, సమాన అవకాశాలు, ఆర్థిక సమానత్వం లాంటి అంశాలపై చర్చ జరిగేందుకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని, విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ హక్కులు లాంటి రంగాల్లో ప్రజలు ఎందుకు వెనుకబడి ఉన్నారన్న విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని ఎంఎఫ్.గోపీనాథ్ చెప్పారు.
‘రాజ్యాంగ రక్షణ మన బాధ్యత, సమానత్వ సమాజం మన లక్ష్యం, ప్రజలందరూ ఆత్మ గౌరవంగా బతకండి, మన గౌరవాన్ని అమ్ముకోకూడదు, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకండి, దోపిడీదారులకు అవకాశాలు ఇవ్వకండి, మంచి వ్యక్తులను ఆదరించండి, అలాంటి వ్యక్తులు మీ సమస్యలు వింటారు, పరిష్కరిస్తారు’ అని ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తున్నామన్నారు.
