రామాయంపేటను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని పబ్లిక్ డిమాండ్

రామాయంపేటను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని  పబ్లిక్ డిమాండ్
  • రామాయంపేటను రెవెన్యూ డివిజన్.. రంగంపేటను మండలంగా మార్చాలని ఆందోళనలు 
  • ఇంటింటికీ తిరిగి కరత్రాల పంపిణీ.. నిరాహార దీక్షలకు సన్నాహాలు 

మెదక్, రామాయంపేట, వెలుగు:  మెదక్​ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని  ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో రామాయంపేట అసెంబ్లీ సెగ్మెంట్ రద్దయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రామాయంపేట కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్​ మొదలైంది. రామాయంపేట పట్టణం హైదరాబాద్–నాగ్​పూర్ నేషనల్ హైవే మీద ఉండడం, చుట్టు పక్కల అనేక గ్రామాలకు సెంటర్ గా ఉండడంతో డెవలప్ అయ్యింది. ఈ క్రమంలో రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి మండలాలను  కలిపి రామాయంపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇందుకోసం 2017, 2018 లో ఎమ్మెల్యే, మంత్రులు, ఉన్నతాధికారు వినతిపత్రాలు ఇవ్వడంతోపాటు వివిధ పార్టీలు, కుల, యువజన, వ్యాపార తదితర సంఘాలన్నీ ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. అఖిల పక్ష నాయకులతో పాటు, కుల సంఘాలు, స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో 183 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం కొత్తగా పలు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ జాబితాలో రామాయంపేటకు మాత్రం  చోటు దక్కలేదు. 

మలి దశ ఉద్యమం షురూ.. 

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల డిమాండ్ లను నెరవే ర్చే అవకాశం ఉందని భావించి రామాయంపేట పట్టణ, పరిసర ప్రాంత వాసులు రెవెన్యూ డివిజన్ కోసం మళ్లీ ఉద్యమం మొదలు పెట్టారు. పార్టీలకు
 అతీతంగా జేఏసీ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ఈ నెలాఖరు లో నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.

మెదక్​ జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్, కొత్త మండలం కోసం మరోమారు పోరాటాలు మొదలయ్యాయి. రామాయంపేట పట్టణ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, కొల్చారం మండల పరిధిలోని రంగంపేటను కొత్త మండలంగా మార్చాలని ఆయా ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రామాయంపేటలో ఇప్పటికే ఇంటింటికీ కరపత్రాలు పంచారు. నిరహారా దీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

రంగంపేట మండలం కోసం...

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రంగంపేట కేంద్రంగా మండలం ఏర్పాటు అయ్యింది. అధికారులు మండల ఆఫీస్ లు కూడా ఏర్పాటు చేశారు. కాగా కొల్చారం గ్రామస్తులు ఆందోళన చేయడంతో రంగంపేట నుంచి మండల కేంద్రం కొల్చారానికి మారింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసిన సమయంలో రంగంపేటను మండలంగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. కానీ అది నెరవేరలేదు. ఇటీవల ప్రభుత్వం పలు కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో రంగంపేటను కూడా కొత్త మండలం ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందుకోసం ఆందోళనకు సిద్ధమవుతుండగా ఇటీవల దళిత సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

నిరాహార దీక్ష చేస్తాం

రెవెన్యూ డివిజన్ కోసం ఈ నెల 28 నుంచి నిరాహార దీక్ష  చేపడుతాం. డివిజన్ కోసం గతం లోనూ 183 రోజులు ఆందోళన చేశాం.  కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు వ్యాపారస్తులు, కుల సంఘాలను కలుపుకొని ముందుకు సాగుతాం. డివిజన్ ఏర్పాటు చేసే వరకూ ఉద్యమాన్ని ఆపేదే లేదు.

-  సుప్రభాత రావ్, 

జేఏసీ లీడర్, రామాయంపేట