
హైదరాబాద్, వెలుగు : 1908 సెప్టెంబర్ 28 న మూసీ నది వరదలతో హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసింది. ఆగకుండా మూడు రోజులు వర్షం కురవగా, అఫ్జల్ గంజ్ ఉస్మానియా హాస్పిటల్ ప్రాంతంలోని బస్తీలు వరదలో కొట్టుకుపోతుండగా, ఓ చింత చెట్టు 150 మంది ప్రాణాలను కాపాడి ప్రాణదాతగా నిలిచింది. మూసీ పక్కనే ఉన్న వందల ఏళ్ల వయసున్న ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ చెట్టు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కాంపౌండ్ లో ఉంది. ఈ చారిత్రాత్మక వృక్షం నేడు ప్రమాదంలో ఉంది.
నిజాం నవాబుల కాలంలో, గత ప్రభుత్వాల హయాంలో చెట్టుకు మంచి ప్రాధాన్యత ఇచ్చినా, ప్రస్తుతం అధికారుల చిన్న చూపుతో ప్రాధాన్యత కోల్పోతుంది. అంతేకాకుండా ఉస్మానియా హాస్పిటల్ చెత్త, వ్యర్థాలు వేస్తుండడంతో పాటు మందుబాబులతో చెట్టుకు తీవ్ర నష్టం జరుగుతుంది. చెట్టు పరిసరాల్లోని వ్యర్థాల వల్ల వెలువడుతున్న రసాయనిక వాయువుల ధాటికి చెట్టు భాగాలు, మొదలు దెబ్బతింటోంది. ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లో చెట్టు కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. కాలుష్యంతో ఇప్పటికే చెట్టు మొదలు ఫంగస్ సోకింది . దీని తీవ్రత ఎక్కువైతే మెల్ల మెల్లగా చెట్టుని నాశనం చేసే అవకాశం ఉంది. ఫంగస్ నుంచి చెట్టును కాపాడేందుకు అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
తాగుబోతులకు అడ్డా
పర్యాటక ప్రదేశంగా మారాల్సిన ఈ చెట్టు ప్రస్తుతం గంజాయి వ్యాపారానికి, తాగుబోతులకు అడ్డాగా మారింది.
పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా హాస్పిటల్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యాన్ని చూపుతోంది. పర్యావరణ, సామాజిక కార్యకర్తలు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తీరు మార లేదు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుని చారిత్రక జ్ఞాపకాన్ని కాపాడాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
చెట్టును కాపాడాలి
మూసీ వరదలు వచ్చిన సమయంలో ఎంతో మంది ప్రజలను కాపాడింది. ఈ చెట్టును నిజాం రాజులు కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో సోమేష్‌కుమార్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు పార్కుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం చెట్టు మొదటిభాగంలో పాకురు చేరిపోయింది. చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పక్కనే ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి చెందిన మెడికల్ వ్యర్థాలు ఇక్కడే పడేస్తున్నారు. సాయంత్రం అయితే మందు బాబులకు అడ్డాగా మారింది. ప్రభుత్వం శ్రద్ధ వహించి చరిత్రకు గుర్తుగా నిలిచిన చెట్టును కాపాడాలి. ‑ సలావుద్దీన్, సామాజిక కార్యకర్త