లెటర్​ టు ఎడిటర్​: గెజిటెడ్ సంతకాల కోసం ప్రజల పాట్లు

లెటర్​ టు ఎడిటర్​: గెజిటెడ్ సంతకాల కోసం ప్రజల పాట్లు

గెజిటెడ్ సంతకాల కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, నిరుద్యోగులు గెజిటెడ్ సంతకాల కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోతున్నారు.  అధికారుల హోదాను బట్టి మరి కొంతమంది ఉద్యోగులకు గెజిటెడ్ హోదా కల్పించాలి.  ప్రభుత్వ సంస్థలలో పనిచేసే  సమానమైన హోదా కలిగిన ఉద్యోగులకు, వివిధ యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ పట్టా పొందినవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంస్కరణల్లో భాగంగా గెజిటెడ్ హోదా కల్పించాలి. ఉన్నత ఉద్యోగులను, ఉన్నత విద్యావంతులను గౌరవించాలని  తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వానికి మనవి. 
- రాపాక రవీందర్, జనగాం

కొరవడిన విద్యాహక్కుచట్టం అమలు 

భారతదేశంలో ఉన్న పేదింటి పిల్లలందరికీ  అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లు కేటాయించి,  వారందరి  నుంచి  ఎటువంటి ఫీజు తీసుకోకుండా  ఉచితంగా విద్యను బోధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని 2009వ సంవత్సరంలో రూపొందించింది. అయితే,  ప్రస్తుతం  ఈ చట్టం తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదు. అన్ని ప్రైవేట్ స్కూల్స్ లో విద్యా విధానం మొత్తం  వ్యాపారంగా  మారిపోయింది.  ప్రతి సంవత్సరం పాఠశాల యాజమాన్యం  వారి ఇష్టానుసారం ఫీజులను పెంచి లాభాలను పొందుతూ కూడా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడం లేదు. 

ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్​  ప్రభుత్వమైనా విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో వెంటనే అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలి.  కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి  మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెడుతామని హామీ ఇవ్వడం జరిగింది. కావున వీలైనంత త్వరగా ప్రభుత్వం వీటిని అమలు చేయాలి.
-  కె, శ్రావణ్,  కొండాపూర్