ఆర్‌‌‌‌ఎంపీలు ప్రథమ చికిత్సకు  మించి చేస్తే క్లినిక్ సీజ్

ఆర్‌‌‌‌ఎంపీలు ప్రథమ చికిత్సకు  మించి చేస్తే క్లినిక్ సీజ్

హైదరాబాద్, వెలుగు: ఆర్‌‌‌‌ఎంపీలు, పీఎంపీలు నడిపించే క్లినిక్‌‌లు, దవాఖాన్లను తనిఖీ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలకు సూచించారు. హాస్పిటల్‌‌, క్లినిక్ అని బోర్డులు పెట్టుకోవడం, పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం నిబంధనలకు విరుద్ధమని, అలాంటివాళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌‌‌‌ అని పెట్టుకుని, అక్కడి వరకే పరిమితమైనవాళ్లను ఇబ్బంది పెట్టొద్దన్నారు. అబార్షన్లు, ఆపరేషన్లు, అర్హతకు మించి మెడిసిన్ రాసేవారిని ఉపేక్షించొద్దన్నారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌వోలతో డీహెచ్‌‌ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంత మంది డీఎంహెచ్‌‌వోలు, సిబ్బంది ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీహెచ్ హెచ్చరించారు. డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు, డాక్టర్లకు డీహెచ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియో ప్రకటనను డీహెచ్ రిలీజ్ చేశారు. 

ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నందుకే.. 

నకిలీ హాస్పిటళ్లు, నకిలీ డాక్టర్లు, హాస్పిటళ్లలో ఉన్న లోపాలపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నందునే.. తనిఖీలు చేపట్టాలని నిర్ణయించామని శ్రీనివాసరావు అన్నారు. హాస్పిటల్‌‌కు రిజిస్ట్రేషన్ ఉండి చిన్న చిన్న లోపాలు ఉంటే చర్యలు తీసుకోవట్లేదని, లోపాలను సరిదిద్దుకోవడానికి రెండు వారాలు గడువు ఇస్తున్నామని చెప్పారు. అప్పటికీ లోపాలను సవరించుకోకపోతే చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొంత మంది ఆయుష్ డాక్టర్లు అల్లోపతి డాక్టర్లుగా చలామణి అవుతున్నారని, అల్లోపతి మెడిసిన్ రాస్తున్నారని, ఇది ప్రజలను మోసగించడమేనని డీహెచ్ అన్నారు. తనిఖీల్లో దొరికితే అలాంటివాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వాలిఫైడ్ డాక్టర్లు తనిఖీలకు సహకరించాలని డీహెచ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,058 ఆస్పత్రులను తనిఖీ చేశామని, ఇందులో 103 దవాఖాన్లను సీజ్ చేశామని డీహెచ్ వెల్లడించారు. 633 హాస్పిటళ్లకు నోటీసులు ఇచ్చామని, 75 ఆస్పత్రులకు ఫైన్లు వేశామని తెలిపారు.

మంత్రిని కలిసిన ఆర్‌‌‌‌ఎంపీలు

తమ క్లినిక్‌‌లపై హెల్త్ ఆఫీసర్ల దాడులను ఆపాల ని కోరుతూ ఆర్‌‌‌‌ఎంపీలు హెల్త్ మినిస్టర్‌‌‌‌ హరీశ్‌‌రావు, డీహెచ్ శ్రీనివాసరావును కలిసి విజ్ఞప్తి చేశారు. తాము ఎన్నో ఏండ్లుగా సర్వీస్ అందిస్తున్నామని, చర్యలు తీసుకోవద్దని కోరారు. అబార్షన్లు, ఆపరేషన్లు, డెలివరీలు చేయడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వాళ్లను వదిలేది లేదని మంత్రి చెప్పారు. సాధారణ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఆఫీసర్లు ఇబ్బంది పెట్టబోరని హామీ ఇచ్చారు.