ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్​/కామారెడ్డిటౌన్​, వెలుగు :  ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టరేట్లలో సోమవారం జరిగిన ప్రజావాణికి 213 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా సమస్యలపై నిజామాబాద్​లో 117, కామారెడ్డిలో 96 ఫిర్యాదులు రాగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​సంగ్వాన్​, అడిషనల్ కలెక్టర్ చందర్​ నాయక్, నిజామాబాద్ అడిషనల్​ కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్ ఫిర్యాదులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.  ఇరు జిల్లాల్లోని కార్యక్రమాల్లో కామారెడ్డి  ఆర్డీవో వీణ, నిజామాబాద్​ జడ్పీ సీఈవో సాయాగౌడ్​, ఇన్​చార్జి ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. 

కోటగిరి మండల కేంద్రం లోని దామర చెరువు తూము లీకేజీ అవుతుందని, రిపేర్ చేయించాలని కోటగిరి రైతులు ఫిర్యాదు చేశారు.  నీరు వృథాగా పోతుందని స్థానిక అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని రైతులు వడ్ల శ్యామ్, ఏముల నవీన్, మామిడి శ్రీనివాస్, పత్తి సతీష్, మహేష్ వాపోయారు.  

కోటగిరి మండల కేంద్రం లోని పోలీస్ స్టేషన్ పక్క నుంచి గవర్నమెంట్ హై స్కూల్, ఎక్లాస్ పూర్ రోడ్డు వరకు ఖబ్రస్థాన్ పక్క నుంచి వెళ్లే రోడ్డును 33 ఫీట్ల సీసీ రోడ్డు వేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.  తహసీల్దార్, పంచాయతీ రాజ్ ఏఈ, కోటగిరి జీపీ సెక్రటరీకి పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదన్నారు .