సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో జనం అవస్థలు

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో జనం అవస్థలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాసాలమర్రిని బంగారు మర్రి చేస్తానని సీఎం కేసీఆర్  ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని వాపోతున్నారు. మోడల్ విలేజ్ నిర్మాణం ఇంకా జరగలేదని చెబుతున్నారు. బంగారు వాసాల మర్రి చేస్తనని .. సీఎం కేసీఆర్ తమను బజార్ల పడేసిండని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నరు. యాదగిరి గుట్ట నుంచి ఎర్రవల్లికి వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ కోసం వాసాలమర్రిలోని రోడ్డుపక్కనున్న చాలా ఇండ్లను అధికారులు కూల్చేశారు. అయితే ఇండ్లు కోల్పోయిన వారికి ఇంకా నష్టపరిహారం చెల్లించలేదు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే వాళ్లకు మళ్లీ ఇళ్లు కట్టిస్తనని, ఎకరం జాగా ఇస్తనని  సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అటకెక్కిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

కూల్చేసిన ఇళ్లు కట్టుకోవడానికి ఆర్థికసాయం కూడా అందించలేదని అంటున్నారు.  సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం.. గ్రామంలోని భూమి లేని వాళ్లకు వెంటనే భూమిని చూపించాలని డిమాండ్ చేశారు. ఊరిలో రోడ్డు విస్తరణ పనులు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా నత్తనడకన జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. మట్టి రోడ్డు పై నుంచి దుమ్మూ ధూళి వచ్చి తమ ఇళ్లలో పడుతోందని చెప్పారు.  ‘‘సీఎం కేసీఆర్ మా భూమిని గుంజుకున్నడు. ఊరిని అభివృద్ధి చేస్తనని చెప్పి.. నాశనం చేసిండు’’ అని ఆరోపించారు. గతంలో తమ ఊరి ప్రజలను సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్ కు పిలిపించి మరీ అభివృద్ధి పనుల గురించి హామీ  ఇచ్చారని.. అయినా వాటి అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.