కరోనా టీకా కోసం క్యూ కడుతున్న జనాలు

కరోనా టీకా కోసం క్యూ కడుతున్న జనాలు
  • టీకా కోసం క్యూ
  • మూడు రోజుల్లో మూడు రెట్లు పెరిగిన జనం
  • జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులు, హైదరాబాద్‌లో ప్రైవేట్‌ వైపు పబ్లిక్ మొగ్గు
  • సెంటర్లు పెంచాలని హెల్త్ డిపార్ట్​మెంట్ నిర్ణయం
  • నేటి నుంచి అన్ని జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, సీహెచ్‌సీలలోనూ టీకా

హైదరాబాద్ / కరీంనగర్, వెలుగు: కరోనా వ్యాక్సిన్‌‌పై జనాల్లో ఇంట్రస్ట్ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు. తొలి రోజు 4,558 మందే వ్యాక్సిన్ వేయించుకోగా, మూడో రోజుకు ఈ సంఖ్య మూడింతలు పెరిగింది. రెండోరోజు 8,523 మంది, మూడో రోజైన బుధవారం 15,474 మంది టీకా వేయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 171 ప్రభుత్వ, 121 ప్రైవేట్ హాస్పిటళ్లలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. ప్రభుత్వ సెంటర్లలో 7,203 మంది, ప్రైవేట్ సెంటర్లలో 8,271 మంది టీకా వేయించుకున్నట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. జనాలు ఇంట్రస్ట్‌‌ చూపుతుండడంతో వ్యాక్సిన్ సెంటర్లను పెంచాలని ఆఫీసర్లు నిర్ణయించారు. గురువారం నుంచి అన్ని జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టీకాలు వేస్తామని చెప్పారు. గురువారం నుంచి 150 ప్రైవేట్‌‌ సెంటర్లలో వ్యాక్సినేషన్ జరగొచ్చని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు.

నేరుగా వచ్చి..

నెల రోజుల దాకా స్లాట్లు బుక్ అయ్యాయన్న ప్రచారం వట్టిదేనని, ఈ ప్రచారం కారణంగా వచ్చే వాళ్లు కూడా వెనక్కి తగ్గుతున్నారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ సెంటర్లలో రద్దీ ఉండకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌‌లోని అన్ని సెంటర్ల వద్ద ఆన్‌‌సైట్‌‌ రిజిస్ర్టేషన్ అందుబాటులో ఉంటుందని, నేరుగా తమకు నచ్చిన సెంటర్‌‌‌‌కు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. నాలుగైదు కార్పొరేట్ హాస్పిటళ్లలో మాత్రమే ఎక్కువ రిజిస్ర్టేషన్లు అయ్యాయని, అక్కడ రోజుకు 200 మందికే వేయాలన్న అప్పర్ లిమిట్‌‌ విషయంలో సడలింపును ఇచ్చామని తెలిపారు. ఆ సెంటర్ల వద్ద కూడా ఆన్‌‌సైట్ రిజిస్ర్టేషన్ అందుబాటులో ఉంటుందన్నారు.

కరోనా వ్యాక్సిన్‌పై జనాల్లో అవేర్‌‌నెస్ పెరిగింది. మొదటి రెండు రోజులతో పోలిస్తే టీకా కోసం రిజిస్ట్రేషన్​ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్
హాస్పిటల్స్‌తో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా తీసుకునేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్​లో ఒక్కో డోసుకు రూ.250 దాకా తీసుకుంటుండడమే కారణమని భావిస్తున్నారు . హైదరాబాద్‌లో మాత్రం ప్రభుత్వ సెంటర్ల కంటే, ప్రైవేట్‌లో టీకా వేసుకునేందుకే జనం మొగ్గు చూపుతున్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.

కరీంనగర్​ జిల్లాలో తొలిరోజు 225 మంది రిజి స్ట్రేషన్ చేసుకోగా, 129 మంది టీకాలు వేయించుకున్నారు . రెండో రోజు 321 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 230 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. బుధవారం 435 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 432 మందికి ఇచ్చామని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు.
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్​లో తొలిరోజు 73 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మూడోరోజు 546 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 544 మంది వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇక్కడి 2 ప్రైవేట్ సెంటర్లలో ఫస్ట్​ డే 8 మంది, థర్డ్​ డే 88 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు .
ఖమ్మం జిల్లాలో తొలిరోజు 113 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 41 మంది టీకా తీసుకున్నారు. మూడోరోజు 534 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని, 474 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు .
సంగారెడ్డి జిల్లాలో తొలిరోజు కేవలం 53 మందే రిజిస్ట్రేషన్ చేసుకోగా, బుధవారానికి ఈ సంఖ్య 104కు చేరింది.
కామారెడ్డిలో వరుసగా మూడు రోజులు112, 126, 198 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో మొదటిరోజు 114 మంది, మూడోరోజు 267 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో తొలిరోజు 8 మంది, మూడోరోజు 43 మంది టీకా వేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజుల్లో 253 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

మంది ఎక్కువుంటే ప్రైవేటుకు పోయిన
గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే టీకా వేసుకుందామని అనుకున్న. అక్కడికి పోతే అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నరు. అందుకే ప్రైవేటు ఆసుపత్రికి పోయి టీకా వేయించుకున్న. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్లు చేసే కౌంటర్లు పెంచాలి. అట్లయితేనే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది.
– ఇ. రమామాధవి, కరీంనగర్

క్షణాల్లో అయిపోయింది
ఖమ్మంలోని శ్రీ రక్ష ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా. కొవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ క్షణాల్లోనే అయిపోయింది. అప్రూవల్ రాగానే ఆస్పత్రి సిబ్బంది టీకా వేశారు. ఎలాంటి భయం కలగలేదు. అంతా కొద్ది నిమిషాల్లోనే పూర్తయింది.
– నారాయణరావు, ఖమ్మం