
- దవాఖాన్లకు, మందులకే మస్తు పైసల్
- జీతం రూ. 18 వేలు.. హెల్త్ కేర్ ఖర్చు రూ. 4 వేలు
- నెలవారీ ఖర్చులో 14 శాతం వాటికే
హైదరాబాద్‌కు చెందిన రమేశ్.. ఓ కంపెనీలో చిరుద్యోగి. వచ్చే జీతం రూ.18 వేలు. కొన్ని నెలలుగా ఆయన బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. మందుల కోసమే నెలకు రూ. 2 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా మూడు నెలల కోసారి డాక్టర్ చెకప్‌లు.. ఏడాదికి రెండు మూడు సార్లు టెస్టులు.. సీజనల్ జబ్బులు.. ఇట్ల యావరేజీగా ప్రతి నెలా రూ. 3 వేల దాకా దవాఖాన్లకు, మందులకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది రమేశ్ ఒక్కడి ఖర్చే. ఇంట్లో వాళ్లకు ప్రతి నెలా ఏదో అనారోగ్య సమస్య రావడంతో మరో వెయ్యి దాకా ఖర్చవుతోంది. ఇట్ల రాష్ట్రంలో చాలా ఫ్యామిలీల నెలవారీ ఖర్చుల్లో మెడిసిన్స్కు, దవాఖాన్లకే మస్తుగా పైసలు అవుతున్నాయి.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హెల్త్ కేర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కో కుటుంబం తమ నెలవారీ ఖర్చులో దవాఖాన్లకు, మందుల కోసమే 14 శాతం వెచ్చిస్తోంది. ఇది దేశ యావరేజీ (13 శాతం) కంటే ఒక శాతం ఎక్కువ. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తదితర సంస్థలు కలిసి చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్రాన్ని అర్బన్, రూరల్ ఏరియాలుగా విభజించి సర్వే చేపట్టారు. అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఫ్యామిలీ తమ నెలవారీ ఖర్చులో 10.8 శాతం, రూరల్‌లో 17.5 శాతం హెల్త్ కేర్ కోసం వాడుతోంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవాళ్లు, వృద్ధులు ఉన్న ఇండ్లల్లో ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని సర్వే పేర్కొంది.
హెల్త్ కేర్ ఖర్చు పెరగడానికి ప్రధాన కారణం లైఫ్ స్టయిలేనని డాక్టర్లు చెప్తున్నారు. ఇరవై ఏండ్ల కిందటి వరకూ అంటువ్యాధులు 70 శాతం ఉంటే, 30 శాతమే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ) ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దవాఖాన్లకు వచ్చే ప్రతి వంద మంది పేషెంట్లలో 63 మంది నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌తో వస్తుంటే, 27 శాతం మంది ఇతర జబ్బులతో వస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోవడం, ఫోన్ల కారణంగా నిద్రకు దూరమవడం, తిండి టైమ్‌కు తినకపోవడం ఇలా అనేక కారణాలతో జనం డయాబెటిస్, బీపీ వంటి ఎన్‌సీడీ జబ్బుల బారిన పడుతున్నారు. ఇటీవల విడుదలైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 ఏండ్ల వయసు దాటిన 14.7 శాతం మంది మహిళలకు, 18.1 శాతం మంది పురుషులకు డయాబెటిస్ ఉందని తేలింది. మరో 26.1 శాతం మంది మహిళలకు, 31.4 శాతం మంది పురుషులకు హైబీపీ ఉందని వెల్లడైంది. ఈ లెక్కన రాష్ట్రంలో దాదాపు ఇంటికొక డయాబెటీస్ లేదా షుగర్ పేషెంట్ ఉన్నారు. గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, ఒబెసిటీకి కూడా హైదరాబాద్ అడ్డాగా మారినట్టు ఇదివరకు జరిగిన సర్వేల్లో వెల్లడైంది. ఈ తరహా జబ్బులు ఒకసారి ఎటాక్ అయితే జీవితాంతం మెడిసిన్ వాడాల్సి వస్తోంది. డయాబెటీస్, బీపీ, ఒబెసిటీ వంటి జబ్బులు పెరగడానికి లైఫ్ స్టయిల్లో వచ్చిన మార్పులే కారణమని డాక్టర్లు అంటున్నారు. సమయానికి తినకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం, టెన్షన్స్, చెడు అలవాట్లు తదితర కారణాల వల్ల జనం రోగాల పాలవుతున్నారని వారు చెప్తున్నారు. దీంతో నెలవారీ సరుకుల లిస్టులో మందులు కూడా చేరిపోయి, హెల్త్ కేర్ ఖర్చు పెరుగుతోందని అంటున్నారు. ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటే నెలకు సగటున మందుల కోసమే రూ.2,000 ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా మూడు నెలల కోసారి డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒకటీ రెండు సార్లైనా టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటికీ ఐదారు వేల రూపాయలు అవుతాయి. వీళ్లకు సీజనల్ డిసీజ్ ఈజీగా వస్తుంటాయి. వాటికీ అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొన్ని ఇండ్లల్లో ఇద్దరు డయాబెటిక్ పెషెంట్లు ఉంటే.. ఈజీగా నెలకు రూ. 8,000 దాకా ఖర్చవుతుంది.
ప్రైవేటులో ఫీజులపై కట్టడేదీ?
ప్రజల హెల్త్ కేర్ ఖర్చు పెరగడానికి సర్కార్ దవాఖాన్లపై ప్రభుత్వ చిన్నచూపు, కార్పొరేట్ సంస్థలు వైద్య రంగంలోకి ఎంటర్ అవడం కూడా కారణమవుతోంది. సర్కార్ హాస్పిటళ్ల సంఖ్యను పెంచకపోవడం, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు సిటీలకే పరిమితం అవడం, మోడర్న్ ట్రీట్మెంట్కు అవసరమయ్యే డయాగ్నసిస్ మెషిన్లు, మెడిసిన్స్‌ను సమకూర్చకపోవడం వంటి సమస్యలు ప్రజలను ప్రభుత్వ దవాఖాన్లకు దూరం చేస్తున్నాయి. మన రాష్ట్రంలో కేవలం 17 నుంచి 20 శాతం మంది ప్రభుత్వ దవాఖాన్లను వినియోగించుకుంటుంటే, 80 శాతం మంది ప్రైవేట్, కార్పొరేట్ దవాఖాన్లపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ దవాఖాన్లు మందులు, ట్రీట్‌మెంట్ ఖర్చును విపరీతంగా పెంచేశాయి. డయాగ్నసిస్ చార్జీలు, బెడ్ చార్జీలు, డాక్టర్ల ఫీజులు, నర్సింగ్ చార్జీల పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఈ దోపిడీ వల్ల కరోనా టైంలో చాలా మంది ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఫీజుల దోపిడీని అరికట్టే వ్యవస్థేది రాష్ట్రంలో లేదు. కరోనా సమయంలో వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వ పెద్దలు, హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
లైఫ్ స్టయిల్ సెట్ చేసుకోవాలి
ఇప్పటికే ప్రతి ఇంట్లో ఒకరికి బీపీనో, షుగరో వచ్చింది. అందుకే ఖర్చు పెరిగింది. ఇకనైనా లైఫ్ స్టయిల్‌ను సెట్ చేసుకోకపోతే మంత్లీ ఇన్‌కమ్‌లో సగం హెల్త్ కేర్ కోసమే పెట్టాల్సిన రోజులొస్తయ్. ప్రభుత్వాలు కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్, హెల్త్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెట్టాలి. జబ్బు చేశాక ట్రీట్‌మెంట్ అందించడం ఎంత ముఖ్యమో, జబ్బు చేయకుండా ప్రివెంటివ్ మెజర్స్‌పై ఫోకస్ చేయడం అంతకంటే ముఖ్యం.
– డాక్టర్ రాహుల్ అగర్వాల్, జనరల్ ఫిజీషియన్, మెడికవర్ హాస్పిటల్స్