ఇల్లు నిర్మించుకొనే విషయంలో కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం. ఇంట్లో ఏ రూం ఎక్కడ ఉండాలి.. ముఖ్యంగా పూజగదికి డోర్ ఉండాలా.. లేకపోతే నష్టాలొస్తాయా. దేవుడి గదిలో పెద్దల ఫోటోలు ఉండవచ్చా.. .డైనింగ్ విషయంలో వాస్తు ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి.. భోజనం చేసే విషయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలు ఏమిటి.. మొదలగు వాస్తు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
ప్రశ్న: మేము ఈమధ్య పక్క ఊళ్లో కొంత స్థలం కొన్నాం. వచ్చే ఎండాకాలంలో ఇల్లు కట్టాలనుకుంటున్నాం. అయితే మా పాత ఇంట్లో ప్రత్యేకంగా పూజ గది లేదు. వంటగదిలోనే షెల్స్ లో పెట్టుకున్నాం. దానివల్లే మాకు అప్పులు అయ్యాయని చాలామంది అన్నారు. అందుకే కొత్త ఇంట్లో పూజ గది కట్టాలనుకుంటున్నాం. దాన్ని కచ్చితంగా ఈశాన్యంలోనే కట్టాలని కొంతమంది సూచిస్తున్నారు. అసలు దేవుడి గది ఎలా, ఎక్కడ ఉంటే మంచిది? అలాగే చనిపోయిన మా పెద్దల ఫొటోలను ఆ గదిలో పెట్టుకోవచ్చా? మా ఇంట్లో హాల్లో రాగి యంత్రాలను పెట్టుకున్నాం. వాటికి ఏ ఏ రోజు పూజ చేస్తే మంచి జరుగుతుందో చెప్పండి?
జవాబు : మీ కొత్త ఇంట్లో పూజ గదిని ఈశాన్యంలో కొందరు పెట్టమంటున్నారని చెప్పారు. దాన్ని నేను సమర్థించను. ఎందుకంటే ఆ మూల బరువు ఉండకూడదు. అక్కడ ఏమీ లేనప్పుడే దేవుడు ఉన్నట్లు లెక్క. ప్రత్యేకంగా అక్కడ దేవుడి పటాలను పెట్టనక్కర్లేదు. అసలు ఈశాన్యం మూల దీపారాధనలు చేయకూడదు. అలాగే, పూజ గదిని నైరుతి మూలన కాకుండా. పడమర గోడకు పెట్టి, దేవుడి ముఖం తూర్పుకు ఉండేలా చూసుకోవాలి. లేదా హాల్లో పె ట్టుకునేట్లయితే... దేవుడి ముఖం పడమర చూడొచ్చు. పూజ గదికి తలుపు ఉండటం అన్నింటికన్నా ముఖ్యం. అది కుదరనప్పుడు. కనీసం పరదా అయినా అడ్డు ఉండాలి. ఇంట్లో రాగి లేదా బంగారు యంత్రాలు ఉన్నప్పుడు.. నిష్టగా ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజలు చేయాలి. లేదంటే దరిద్రం పట్టుకుంటుంది. అలా కుదరనప్పుడు వాటిని ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది. అలాగే చనిపోయిన పెద్దల ఫొటోలను దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. వాళ్లకు పూజ కూడా చేసుకోవచ్చు.
►ALSO READ | జ్యోతిష్యం : ఈ ఏడాది 2 చంద్ర, 2 సూర్య గ్రహణాలు.. ఏ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..!
ప్రశ్న: మొన్నటివరకూ మేము హాల్లో కింద కూర్చునే భోజనం చేసేవాళ్లం. అయితే వారం కిందటే డైనింగ్ టేబుల్ తీసుకొచ్చాం. దాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు.. అలాగే ఎటువైపుకు ముఖం పెట్టి తింటే మంచిదో చెప్పండి?
జవాబు : డైనింగ్ టేబల్ ను ఇంట్లో ఎక్కువగా వంట గది పక్కనే పెట్టుకుంటారు. అది మంచిది కూడా. లేదా ఇంటి మధ్యలో పెట్టుకోవచ్చు. తూర్పు దిక్కుకు ముఖం పెట్టి తినడం అందరికీ మంచిదే. తల్లిదండ్రులు ఉన్నవాళ్లు దక్షిణం వైపు తిరిగి తిన్నా పర్వాలేదు. ఉత్తరం ముఖంగా భోజనం చేస్తే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. పీతృకార్యాలకు మాత్రమే దిక్కుగా భోజనం చేస్తారు.
పాటించాల్సిన మరికొన్ని వాస్తు నియమాలు..
- ఉదయం లేచిన వెంటనే.. రెండు అరచేతులను చూసుకోవాలి.
- ఇంటికి తూర్పు, ఉత్తరం దిక్కున కొండలు ఉండకూడదు.
- ప్రతి దర్వాజాకు కచ్చితంగా గడప ఉండాలి.
- ఇంటికి మూడు దిక్కులా రోడ్లు ఉంటే కలసిరాదు.
- అపార్ట్మెంట్ అయినా సరే... వాస్తు చూపించుకోవాలి.
- ఎంగిలి పళ్లాలను కడగకుండా రాత్రిపూట ఇంట్లో ఉంచుకోవద్దు.
- గుడికి ఎదురుగా ఉండే స్థలాన్ని కొనకపోవడమే మేలు.
- వంట గదిలోని సింకు ఈశాన్యం మూల ఉండాలి( నైరుతిలో అసలు ఉండకూడదు)
