నాకంటూ కొంత టైమ్‌ దొరికింది

నాకంటూ కొంత టైమ్‌ దొరికింది

హైదరాబాద్‌‌‌‌: నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్‌‌‌‌గా గురుతర బాధ్యత, చాంపియన్ల కార్ఖానాల్లాంటి రెండు అకాడమీల పర్యవేక్షణ.. సైనా, సింధు, శ్రీకాంత్, సాయి ప్రణీత్‌‌‌‌ ఇలా ఎంతో మంది వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ప్లేయర్లను తీర్చిదిద్దే కర్తవ్యం.. ఇలా అనేక పనులతో సంవత్సరం మొత్తం బిజీగా ఉంటారు బ్యాడ్మింటన్ గురు పుల్లెల గోపీచంద్‌‌‌‌. రోజూ ఉదయం 4 గంటలకే అకాడమీకి రావడం.. బ్యాచ్‌‌‌‌ల వారీగా షట్లర్లకు ట్రెయినింగ్‌‌‌‌ ఇవ్వడం.. హైదరాబాద్‌‌‌‌లో 2005లో అకాడమీ స్టార్ట్‌‌‌‌ చేసినప్పటి నుంచి గోపీ దినచర్య ఇదే. కానీ, కరోనా కారణంగా అన్నీ బంద్‌‌‌‌ కావడంతో తన గురించి ఆలోచించుకునేందుకు గోపీకి టైమ్‌‌‌‌ దొరికింది. ఈ ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ను తన మైండ్, బాడీని ఉత్తేజ పరచుకోవడానికి గోపీ ఉపయోగించుకుంటున్నాడు. అయితే, ఇలాంటి డిఫికల్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌లోనూ గోపీ ప్లేయర్లతో రెగ్యులర్‌‌‌‌గా మాట్లాడుతున్నాడు. వాళ్ల ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ దెబ్బతినకుండా చూడడంతో పాటు వాళ్లలోని అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, కరోనా తర్వాతి ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై ప్లేయర్లలో కొంత భయం ఉందని గోపీ అంటున్నాడు. బీడబ్ల్యూఎఫ్ కొత్త క్యాలెండర్, ట్రెయినింగ్‌‌‌‌ రీస్టార్ట్‌‌‌‌, ఒలింపిక్‌‌‌‌ న్యూ క్వాలిఫయింగ్‌‌‌‌ టైమ్‌‌‌‌ తదితర అంశాల్లో ఎదురయ్యే సమస్యల గురించి పలు విషయాలు వెల్లడించాడు.

ఆ వివరాలు అతని మాటల్లోనే..

జులై 1 నుంచి ట్రెయినింగ్‌‌‌‌ రీస్టార్ట్‌‌‌‌

కోచింగ్‌‌‌‌ క్యాంప్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయొచ్చని స్పోర్ట్స్‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా చెప్పినప్పటికీ.. తెలంగాణ గవర్నమెంట్‌‌‌‌ నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఇక్కడ (హైదరాబాద్‌‌‌‌) జూన్‌‌‌‌ 30 వరకూ స్టేడియాలు మూసే ఉంటాయి. ప్రభుత్వం ఓకే చెబితే జులై 1 నుంచి ట్రెయినింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ అవుతుంది. దశల వారీగా ఆట మొదలుపెడతాం. కానీ, అది స్టేట్‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌ ఇచ్చే గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌పై ఆధారపడి ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ ఇప్పటికే కొత్త క్యాలెండర్ రిలీజ్‌‌‌‌ చేసింది. దీని ప్రకారం ప్లేయర్లు నాలుగు నెలల్లోనే 20 పైచిలుకు టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది. అయితే ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌లో భాగం కాని టోర్నీలు అంత ఇంపార్టెంట్‌‌‌‌ కావు. కాబట్టి ప్లేయర్లు సెలెక్టివ్​గా ఆడొచ్చు.

ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయింగ్ సైకిల్‌‌‌‌ మార్చడం మంచిదే

టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. కాబట్టి ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌ సైకిల్‌‌‌‌ను బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వచ్చే ఏడాది ఆరంభానికి మార్చడం మంచి నిర్ణయం. కొత్త క్వాలిఫయింగ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ 17 వారాలు ఉన్నప్పటికీ క్వాలిఫయింగ్ టోర్నీల సంఖ్య మాత్రం మారలేదు. కాబట్టి బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ మంచి పని చేసిందని అనుకుంటున్నా. మునుపటి క్వాలిఫికేషన్‌‌‌‌ పీరియడ్‌‌‌‌లో మిగిలిన టోర్నమెంట్లను కొత్త దానిలో చేర్చడం సమంజసమే. అందువల్ల ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌లో చేర్చిన టోర్నీలను ఇప్పటికే ఆడిన ప్లేయర్లకు అన్యాయం జరగదు.

ఫ్యూచర్‌‌‌‌ గురించి భయం ఉంది

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సెషన్స్‌‌‌‌ ద్వారా ప్లేయర్లు ట్రెయినింగ్‌‌‌‌ కొనసాగించేలా చూస్తున్నాం. అయినా ప్లేయర్లలో కొంత భయం ఉంది. పోస్ట్‌‌‌‌ కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయని.. ముఖ్యంగా ప్రాక్టీస్‌‌‌‌, టోర్నమెంట్‌‌‌‌, ట్రావెల్‌‌‌‌కు సంబంధించి వారిలో అనేక సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ చాలామంది తిరిగి ప్రాక్టీస్‌‌‌‌ ప్రారంభించాలని, టోర్నీల్లో ఆడాలనే కోరుకుంటున్నారు. వరల్డ్‌‌‌‌ వైడ్‌‌‌‌ చాలా మంది షట్లర్లు ఇప్పటికే ప్రాక్టీస్‌‌‌‌ ప్రారంభించారు. మన దగ్గర బెంగళూరులో ట్రెయినింగ్ సెంటర్లు తెరిచారు. ఇక్కడ (హైదరాబాద్‌‌‌‌) అకాడమీలు మూసే ఉన్నప్పటికీ ఒలింపిక్‌‌‌‌ ప్లేయర్స్‌‌‌‌ అంతా తాము ఉన్నచోటే ట్రెయినింగ్‌‌‌‌ కొనసాగిస్తున్నారు. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లెవెల్స్‌‌‌‌ కూడా ఇంప్రూవ్‌‌‌‌ చేసుకుంటున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. ట్రెయినింగ్‌‌‌‌ తిరిగి మొదలైన తర్వాత ప్లేయర్లు మ్యాచ్ మూడ్‌‌‌‌లోకి వచ్చేందుకు నాలుగు నుంచి ఆరు వారాల టైమ్ సరిపోతుంది.

ప్లేయర్లు వేగంగా ముందుకెళ్తారు

ఇలాంటి విపత్కర పరిస్థితి శతాబ్దానికి ఒకేసారి ఎదురవుతుంది. ఒలింపిక్స్‌‌‌‌ అనేవి క్రీడాకారుల జీవితకాల లక్ష్యం. అలాంటి మెగా ఈవెంట్‌‌‌‌ వాయిదా పడినప్పుడు ప్లేయర్లను మోటివేట్‌‌‌‌ చేయడం కోచ్‌‌‌‌లుగా మా బాధ్యత. అయితే టాప్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ప్లేయర్లు ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకొని నిలబడగలరు. 2021 ముగిసిన వెంటనే 2022లో జరిగే ఏషియన్‌‌‌‌, కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాతి ఏడాదే 2024 ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ అవుతుంది. కాబట్టి, ప్లేయర్లు చాలా వేగంగా ముందుకెళ్తారు.