కశ్మీర్ లో ఎవరు గన్ పట్టినా లేపేస్తాం : ఆర్మీ, CRPF వార్నింగ్

కశ్మీర్ లో ఎవరు గన్ పట్టినా లేపేస్తాం : ఆర్మీ, CRPF వార్నింగ్

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో అత్యంత పాశవిక ఉగ్రదాడి తర్వాత ఇవాళ సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, శ్రీనగర్ లో జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. జమ్ముకశ్మీర్ గడ్డపై అడుగుపెట్టే ఏ ఉగ్రవాదినైనా చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కశ్మీరీ యువత కూడా పోలీసులు, భద్రతా బలగాలకు సహకరించాలని కోరారు. కశ్మీర్ యూత్ ఆయుధాలు పక్కన పెట్టి… భద్రతాబలగాలకు సరెండర్ అయి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయుధాలు ఎవరు పట్టినా చంపేస్తామని సూటిగా హెచ్చరించారు.

“భారత సమాజ నిర్మాణంలో తల్లులదే కీలక పాత్ర. మీ పిల్లలు భద్రతాబలగాలకు సరెండర్ కావాలని, సహకరించాలని చెప్పండి. జన స్రవంతిలో వాళ్లను కలవనీయండి. పోలీసులకు సహకరించకపోయినా… ఆయుధాలు పట్టినా….  వారికి చావే గతి. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీస్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఇంటలిజెన్స్ మధ్య మంచి సమన్వయం ఉంది” అని ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ చెప్పారు.

సోమవారం జరిగిన ఎన్ కౌంటర్ లో… పుల్వామా టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రషీద్ ఘాజీ సహా ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారని చెప్పారు. ఇంకా చాలామంది జైష్ ఎ మహ్మద్ ప్రేరేపేతి ఘాజీలు వస్తూ పోతూ ఉన్నారన్నారు. ఇకనుంచి జమ్ముకశ్మీర్ లోకి వచ్చే ఏ ఉగ్రవాది కూడా ప్రాణాలతో బయటకు వెళ్లలేడు అని హెచ్చరించారు ఆర్మీ అధికారులు.