
పీహెచ్డీ వంటి ఉన్నత చదువులు చదువుతున్న వ్యక్తులు కూడా ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన స్కాలర్.. బెట్టింగ్ ఆడటం.. ఆ మోజులో మోసాలకు పాల్పడటం చూస్తుంటే.. సమాజాన్ని బెట్టింగ్ ఎంతలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ కు చెందిన PhD స్కాలర్.. ఆన్ లైన్ బెట్టింగ్ లో యూనివర్సిటీ వీసీలను మోసం చేయడంతో పుణె పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.
హైదరాబాద్ యాప్రాల్ కు చెందిన కైలారు సీతయ్య అనే పీహెచ్డీ పరిశోధక విద్యార్థి .. ఆన్ లైన్ బెట్టింగ్ లో కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు.
సీతయ్య లండన్ లో ఓ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో Ph.D చేశాడు. ఐఐటీ బాంబేలో ప్రొఫెసర్ ని అని చెప్పి.. ప్రభుత్వ ప్రాజెక్టులను ఇప్పిస్తానని పూణేలో ఉన్న రెండు యూనివర్సిటీలను మోసం చేశాడు. ప్రభుత్వం నుండి ప్రాజెక్టులు, దానికి సంబంధించిన నిధులు ఇప్పిస్తానని చెప్పి వీసీల తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అందుకోసం ముందుగా యూనివర్సిటీ నుండి కొంత డబ్బును తన ఖాతాలోకి వేయించుకున్నాడు. జులై 25, ఆగస్టు 26 మధ్య వీసీల నుంచి 2 కోట్ల 46 లక్షల రూపాయలను తన అకౌంట్లో వేయించుకున్నాడు. ఆ తర్వాత Mou రాసుకోవడానికి రమ్మంటే తప్పించుకు తిరుగుతుండటంతో.. అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు యూనివర్సిటీ ఛాన్స్లర్లు.
సీతయ్య గతంలోనూ ఇదే తరహా మోసలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం (సెప్టెంబర్ 21) హైదరాబాదులో సీతయ్యను అరెస్టు చేసిన పూనే పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.