
చండీఘర్: పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆమె సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఖరార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్మోల్.. ఈ మేరకు రాజీనామా లేఖను ఆదివారం (జూలై 19) పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ పంపించారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.
‘‘ఈ నిర్ణయంతో నా హృదయం బరువెక్కింది. కానీ నేను రాజకీయాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. స్పీకర్‌కు రాజీనామా లేఖను పంపించా. నా రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌ను కోరుతున్నా’’ అని పేర్కొన్నారు అన్మోల్. తనకు అవకాశం కల్పించిన ఆప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని.. రాజకీయాల నుంచి వైదొలిగినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి తన మద్దతు ఉంటుందన్నారు. ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా పని చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.
సింగర్‌గా మంచి గుర్తింపు పొందిన అన్మోల్ గగన్ మాన్ 2022లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖరార్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి తొలిసారే ఘన విజయం సాధించారు అన్మోల్. భగంత్ మాన్ కేబినెట్లో అన్మోల్ రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, పెట్టుబడి ప్రమోషన్, కార్మిక, ఆతిథ్య శాఖ మంత్రిగా పని చేసింది. 2024 కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అన్మోల్కు ఉద్వాసన పలికింది భగంత్ మాన్ సర్కార్. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆమె.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంజాబ్ పాలిటిక్స్‌లో చర్చ జరుగుతోంది. సూట్, గైంట్ పర్పస్, షెర్ని వంటి ఎన్నో ఫేమస్ పాటలు పాడింది అన్మోల్.