
పంజాబ్ లో అధికార ఆప్ నేతలు వరుసగా వివాహాలు చేసుకుంటున్నారు. తాజాగా పంజాబ్ విద్యాశాఖ మంత్రి, సాహిబ్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్ జోత్ బెయిన్స్, ఐపీఎస్ అధికారిణి డాక్టర్ జ్యోతి యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. సిక్కు మతసంప్రదాయాల ప్రకారం జరిగిన వీరి వివాహానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
గురుగ్రామ్ జిల్లాకు చెందిన డాక్టర్ జ్యోతి యాదవ్ ప్రస్తుతం మాన్సాలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా పనిచేస్తున్నారు. ఆమె దంతవైద్యురాలు కూడా. బెయిన్స్ ముందుగా ఆప్ లో వాలంటీర్‌గా చేరారు. 2016లో పార్టీ పంజాబ్ యువజన విభాగం చీఫ్‌గా పనిచేశారు. రూపానగర్ జిల్లాలోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. అనంతరం మాన్ క్యాబినేట్ లో చోటు సంపాదించుకున్నారు.
అటు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుప్రీత్ కౌర్‌ను సీఎం భగవంత్ మాన్ పెళ్లాడారు. ఇక ఆప్ ఎమ్మెల్యేలు నరిందర్ కౌర్ భారజ్, నరిందర్‌పాల్ సింగ్ సవాన్నలు కూడా ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.