V6 News

కింగ్స్ అన్‌‌‌‌స్టాపబుల్ .. పంజాబ్ కింగ్స్ ఖాతాలో ఐదో విజయం

కింగ్స్ అన్‌‌‌‌స్టాపబుల్ .. పంజాబ్ కింగ్స్ ఖాతాలో ఐదో విజయం
  •     దంచికొట్టిన ప్రియాంశ్‌‌‌‌, కనోలి
  •     54  రన్స్‌‌‌‌  తేడాతో ఓడిన లక్నో

ముల్లన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌:  ఐపీఎల్ 19వ సీజన్‌‌‌‌లో  అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్‌‌‌‌  మరోసారి తమ బ్యాట్‌‌‌‌ పవర్ చూపెట్టింది.  ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (37 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 93), కూపర్ కనోలి (46 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 87) ఓ రేంజ్‌‌‌‌లో విజృంభించడంతో  ఈ సీజన్‌‌‌‌లో టాప్ స్కోరు కొడుతూ ఐదో విజయం సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌లో  54   రన్స్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌ను చిత్తు చేసింది. ఈ హైస్కోరింగ్ పోరులో తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 254/7 స్కోరు చేసింది. ఛేజింగ్‌‌‌‌లో లక్నో  20 ఓవర్లలో 200/5  స్కోరు చేసి ఓడిపోయింది.  కెప్టెన్ రిషబ్ పంత్ (23 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌, 4 సిక్సర్లతో 43)తో పాటు ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (22 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), మిచెల్ మార్ష్ (40), ఆయుష్ బదోనీ (35) మెరిపించినా టార్గెట్ మరీ పెద్దది కావడం, పంజాబ్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో  జెయింట్స్‌‌‌‌కు ఓటమి తప్పలేదు. యాన్సెన్ (2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్యకు ప్లేయర్ ఆఫ్​ ద  మ్యాచ్‌‌‌‌ అవార్డు లభించింది.

సిక్సర్ల మోత

ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలి రెండో వికెట్‌‌‌‌కు 185 రన్స్‌‌‌‌ జోడించి  విధ్వంసం సృష్టించడంతో టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన పంజాబ్ భారీ స్కోరు చేసింది. ఇన్నింగ్స్ మూడో బాల్‌‌‌‌కే ఇన్‌‌‌‌ఫామ్ ఓపెనర్ ప్రభ్‌‌‌‌సిమ్రన్ (0)ను డకౌట్ చేసిన మహ్మద్ షమీ లక్నో క్యాంప్‌‌‌‌లో జోష్‌‌‌‌ నింపినా.. ఆ ఆనందం ఆవిరవ్వడానికి  ఎంతో సమయం పట్టలేదు. డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో డ్యాషింగ్ హిట్టర్‌‌‌‌‌‌‌‌గా పేరొందిన ప్రియాంశ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండో ఓవర్లో  మోసిన్ ఖాన్‌‌‌‌కు సిక్స్‌‌‌‌తో స్వాగతం పలికి హిట్టింగ్‌‌‌‌కు తెరలేపాడు. అదే ఓవర్లో  కనోలి  వికెట్ల ముందు దొరికిపోయినా అంపైర్ ఎల్బీ ఇవ్వలేదు. లక్నో కెప్టెన్ పంత్ రివ్యూ కోరకపోవడంతో లభించిన లక్కీ చాన్స్‌‌‌‌ను  కనోలి సద్వినియోగం చేసుకున్నాడు. ఆర్యతో కలిసి క్రమం తప్పకుండా బౌండరీలు కొట్టాడు. మోసిన్ వేసిన ఆరో ఓవర్లో ఆర్య 4, 6, 6 బాదగా.. బదోనీ బౌలింగ్‌‌‌‌లో కూపర్ 4,6తో వేగం పెంచాడు. మిడిల్‌‌‌‌ ఓవర్లలో ఈ ఇద్దరూ పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లు కొట్టడంతో స్కోరుబోర్డు జెట్‌‌‌‌ స్పీడ్‌‌‌‌తో ముందుకెళ్లింది. ఈ క్రమంలో ప్రియాంశ్‌‌‌‌ 19 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. షమీ వేసిన 11వ ఓవర్లో  రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన కూపర్ 35 బాల్స్‌‌‌‌లో హాఫ్ సెంచరీ దాటాడు. ఆపై అవేశ్ బౌలింగ్‌‌‌‌లో ఆర్య రెండు సిక్సర్లు కొట్టాడు. ఇక,  మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ ఓవర్లో కనోలి హ్యాట్రిక్ సిక్సర్లతో టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే.. ఆర్య వరుసగా రెండు సిక్సర్లు రాబట్టడంతో ఏకంగా 32 రన్స్ వచ్చాయి. సెంచరీ దిశగా సాగుతున్న  ఈ ఇద్దరినీ వరుస ఓవర్లలో ఔట్‌‌‌‌ ఔట్ చేసిన లక్నో.. పంజాబ్ స్పీడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5) ఫెయిలవగా.. సిద్దార్థ్ బౌలింగ్‌‌‌‌లో 4, 6 కొట్టి స్కోరు 200 దాటించిన తర్వాత నేహల్ వధేరా (13) కూడా వెనుదిరిగాడు. చివర్లో శశాంక్ సింగ్‌‌‌‌ (17), మార్కస్‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌ (29) దూకుడుగా ఆడారు. అవేశ్ వేసిన 18వ ఓవర్లో స్టోయినిస్ 4, 6, 4 కొట్టాడు. షమీ బౌలింగ్‌‌‌‌లో స్టోయినిస్ 6,  శశాంక్ 6, 4 బాదడంతో పంజాబ్ 270 రన్స్ చేసేలా కనిపించింది. అయితే, లాస్ట్ ఓవర్లో శశాంక్‌‌‌‌, స్టోయినిస్ (రనౌట్‌‌‌‌)ను పెవిలియన్‌‌‌‌ చేర్చిన ప్రిన్స్ యాదవ్ ఐదే రన్స్ ఇచ్చాడు. 

సంక్షిప్త స్కోర్లు

పంజాబ్‌‌‌‌: 20 ఓవర్లలో 254/7 (ప్రియాంశ్ 93, కనోలి 87, ప్రిన్స్ యాదవ్ 2/25).
లక్నో: 20 ఓవర్లలో 200/5 (పంత్ 43, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ 42, మార్ష్​ 40, యాన్సెన్ 2/37).