ప్లే ఆఫ్స్ కు ముందు చేతులెత్తేసిన పంజాబ్.. శ్రేయస్ సేనకు వరుసగా ఐదో ఓటమి

ప్లే ఆఫ్స్ కు ముందు చేతులెత్తేసిన పంజాబ్.. శ్రేయస్ సేనకు వరుసగా ఐదో ఓటమి
  • పంజాబ్‌‌‌‌ ఐదోసారీ.. కింగ్స్‌‌‌‌కు వరుసగా ఐదో ఓటమి
  • 6 వికెట్ల తేడాతో ముంబై విజయం
  • చెలరేగిన తిలక్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌, శార్దూల్‌‌‌‌
  • ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌, అజ్మతుల్లా శ్రమ వృథా

ధర్మశాల:ఐపీఎల్‌‌‌‌–19లో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ పరేశాన్‌‌‌‌ కొనసాగుతోంది. బౌలర్ల వైఫల్యంతో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక కీలక మ్యాచ్‌‌‌‌లో చేతులెత్తేసి ప్లే ఆఫ్స్‌‌‌‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. ఛేజింగ్‌‌‌‌లో తిలక్‌‌‌‌ వర్మ (33 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌‌‌‌లతో 75 నాటౌట్‌‌‌‌), రికెల్టన్‌‌‌‌ (48) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ ఓడిన పంజాబ్‌‌‌‌ 20 ఓవర్లలో 200/8 స్కోరు చేసింది. ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ సింగ్‌‌‌‌ (32 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 57), అజ్మతుల్లా ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ (38) రాణించారు. తర్వాత ముంబై 19.5 ఓవర్లలో 205/4 స్కోరు చేసి నెగ్గింది. తిలక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

తడబడి.. నిలబడ్డారు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌కు టాపార్డర్‌‌‌‌, లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ మెరుగైన స్కోరు అందించింది. స్టార్టింగ్‌‌‌‌లో ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య (22) ఫోర్‌‌‌‌తో, ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ సింగ్‌‌‌‌ రెండు ఫోర్లతో బాదుడు షురూ చేశారు. ఐదో ఓవర్‌‌‌‌లో ప్రభ్‌‌‌‌ మూడు బౌండ్రీలతో జోరు పెంచాడు. కానీ ఆరో ఓవర్‌‌‌‌లో ప్రియాన్షు భారీ షాట్‌‌‌‌కు యత్నించి దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (2/36)కు వికెట్‌‌‌‌ ఇచ్చాడు. తొలి వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో కనోలీ (21) సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేయడంతో పవర్‌‌‌‌ప్లేలో పంజాబ్‌‌‌‌ 55/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌ పెరిగిన తర్వాత కనోలీ 4, 6, 4 కొడితే, ప్రభ్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లు రాబట్టాడు. 

తర్వాతి నాలుగు ఓవర్లలో 34 రన్స్‌‌‌‌ రావడంతో తొలి 10 ఓవర్లలో పంజాబ్‌‌‌‌ 89/1తో మంచి స్థితిలో కనిపించింది. ఇక్కడి నుంచి అద్భుతంగా పుంజుకున్న ముంబై బౌలర్లు పంజాబ్‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌ను దెబ్బకొట్టారు. 11వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో కనోలీ బ్యాట్‌‌‌‌ ఝుళిపిస్తే, ప్రభ్‌‌‌‌ 29 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ 12వ ఓవర్‌‌‌‌లో శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ (4/39) డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. మూడు బాల్స్‌‌‌‌ తేడాలో ప్రభ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (4)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. రెండో వికెట్‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌ జతయ్యాయి. ఇక్కడి నుంచి ఓవర్‌‌‌‌కు ఓ వికెట్‌‌‌‌ కోల్పోయింది. 13వ ఓవర్‌‌‌‌లో రాజ్‌‌‌‌ భవా (1/11).. కనోలీని వెనక్కి పంపాడు. 14వ ఓవర్‌‌‌‌లో శార్దూల్‌‌‌‌ దెబ్బకు సూర్యాన్ష్‌‌‌‌ షెడ్జే (8) ఔటయ్యాడు. 15వ ఓవర్‌‌‌‌లో శశాంక్‌‌‌‌ సింగ్‌‌‌‌ (2) వెనుదిరిగాడు. 

28 రన్స్‌‌‌‌ తేడాలో ఐదు కీలక వికెట్లు పడటంతో పంజాబ్‌‌‌‌ 135/6తో కష్టాల్లో పడింది. అజ్మతుల్లా ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ నిలకడగా ఆడినా.. తన చివరి ఓవర్‌‌‌‌లో శార్దూల్‌‌‌‌.. యాన్సెన్‌‌‌‌ (2)ను ఔట్‌‌‌‌ చేసి నాలుగో వికెట్‌‌‌‌ ఖాతాలో వేసుకున్నాడు. 18వ ఓవర్‌‌‌‌లో ఓ ఫోర్‌‌‌‌, రెండు సిక్స్‌‌‌‌లతో 19 రన్స్‌‌‌‌ కొట్టి అజ్మతుల్లా వెనుదిరిగాడు. చివరి రెండు ఓవర్లలో  విష్ణు వినోద్‌‌‌‌ (15 నాటౌట్‌‌‌‌), బార్ట్‌‌‌‌లెట్‌‌‌‌ (18 నాటౌట్‌‌‌‌) మూడు ఫోర్లు, రెండు సిక్స్‌‌‌‌లతో 32 రన్స్‌‌‌‌ దంచడంతో స్కోరు 200లకు చేరింది. 

సంక్షిప్త స్కోర్లు

పంజాబ్‌‌‌‌: 20 ఓవర్లలో 200/8 (ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ 57, అజ్మతుల్లా 38, శార్దూల్‌‌‌‌ 4/39). 

ముంబై: 19.5 ఓవర్లలో 205/4 (తిలక్‌‌‌‌ వర్మ 75*, రికెల్టన్‌‌‌‌ 48, అజ్మతుల్లా 2/36). 

 

  • తిలక్​ మెరిసె..

ఛేజింగ్‌‌‌‌లో ముంబైకి మంచి ఆరంభమే దక్కింది. రోహిత్‌‌‌‌ (25) నెమ్మదిగా ఆడినా.. రికెల్టన్‌‌‌‌ ఫోర్లు, సిక్సర్లు దంచాడు. దాంతో పవర్‌‌‌‌ప్లేలోనే ముంబై 59/0 స్కోరుతో నిలిచింది. కానీ ఏడో ఓవర్‌‌‌‌లో అజ్మతుల్లా (2/36).. రికెల్టన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేయడంతో తొలి వికెట్‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. కొద్దిసేపటికే 9 బాల్స్‌‌‌‌ తేడాలో నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ (9), రోహిత్‌‌‌‌ ఔట్‌‌‌‌ కావడం తో స్కోరు 88/3గా మారింది. ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో 89/3 స్కోరు చేసిన ముంబై ఇన్నింగ్స్‌‌‌‌ను తిలక్‌‌‌‌ వర్మ, రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ (20) ఆదుకున్నారు. 

వీలైనప్పుడు మాత్రమే భారీ షాట్లు ఆడి మిగతా టైమ్‌‌‌‌లో సింగిల్స్‌‌‌‌తో రన్స్‌‌‌‌ రాబట్టారు. ఫలితంగా నాలుగో వికెట్‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌ జత చేసి రూథర్‌‌‌‌ఫోర్డ్‌‌‌‌ వెనుదిరిగాడు. 25 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసిన తిలక్‌‌‌‌తో కలిసి చివర్లో విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ (25 నాటౌట్‌‌‌‌) దంచుడు మొదలుపెట్టాడు. విజయానికి 12 బాల్స్‌‌‌‌లో 28 రన్స్‌‌‌‌ అవసరం కాగా జాక్స్‌‌‌‌ 6, 4, 6 కొట్టగా, తిలక్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లతో గెలిపించాడు.