పంజాబ్ మంత్రికి 7 రోజుల ఈడీ కస్టడీ..మనీలాండరింగ్ కేసులో సంజీవ్ అరోరా అరెస్ట్

పంజాబ్ మంత్రికి 7 రోజుల ఈడీ కస్టడీ..మనీలాండరింగ్ కేసులో సంజీవ్ అరోరా అరెస్ట్

గురుగ్రామ్: పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సంజీవ్ అరోరాకు కోర్టు కస్టడీ విధించింది. రూ.100 కోట్ల జీఎస్టీ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు గురుగ్రామ్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ  కోర్టు ఆదివారం 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది. నిధుల మళ్లింపు మూలాలను వెలికి తీసేందుకు నిందితుడిని విచారించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అరోరాకు చెందిన 'హాంప్టన్ స్కై రియల్టీ' కంపెనీ నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా మొబైల్ ఫోన్ల ఎగుమతులు జరిగినట్లు సృష్టించి, అక్రమంగా జీఎస్టీ రిఫండ్లు పొందిందని ఈడీ ఆరోపిస్తోంది.

ఈ కుంభకోణంలో భాగంగా ఒక దినసరి కూలీని ఓ కంపెనీ యజమానిగా చూపి, అతని పేరుతో అక్రమ నగదు బదిలీలు చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. కాగా, సంజీవ్ అరోరా అరెస్టును పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను భయపెట్టి బీజేపీలో చేర్చుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలను అస్త్రాలుగా వాడుకుంటోందని వారు ఆరోపించారు. అరోరా తరపు న్యాయవాది స్పందిస్తూ.. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని, ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే మంత్రిని అరెస్టు చేశారని పేర్కొన్నారు.