పంజాబ్లో వార్ వన్ సైడ్.. ఆప్ సునామీ

 పంజాబ్లో వార్ వన్ సైడ్.. ఆప్ సునామీ
  • రికార్డు స్థాయిలో 92 సీట్లు గెలుచుకున్న కేజ్రీవాల్ పార్టీ
  • కనీస పోటీ ఇవ్వని కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్
  • 1966 తర్వాత తొలిసారి కొత్త పార్టీకి అధికారం
  • చన్నీ, సిద్ధూ, అమరీందర్, బాదల్.. అందరూ ఓటమి
  • గెలుపుపై ‘రెవల్యూషన్’ అంటూ ట్వీట్ చేసిన కేజ్రీవాల్

చండీగఢ్ / న్యూఢిల్లీ: పోటీ లేదు.. పోరాటం లేదు.. వార్ వన్ సైడ్ అయింది. ఆరు దశాబ్దాల రికార్డు బద్ధలైంది. రాజకీయ చదరంగంలో తలపండిన పార్టీలు.. ఆమ్ ఆద్మీని అడ్డుకోలేకపోయాయి. పంజాబ్ గడ్డ.. ఆప్ అడ్డాగా మారిపోయింది. సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్.. ఇంకో రాష్ట్రంలో తన పార్టీని అధికారంలోకి తెచ్చిండు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో పవర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీని మట్టికరిపిస్తూ అదిరిపోయే విక్టరీ కొట్టిండు. ఒకప్పటి కమెడియన్ భగవంత్ సింగ్ మన్‌‌‌‌ను ఇప్పుడు హీరోను చేసిండు. ఏకపక్షంగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 92 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. మిగతా పార్టీలకు అందనంత ఎత్తులో నిలిచింది. 2017లో 77 సీట్లలో గెలిచిన కాంగ్రెస్.. కేవలం 18 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో బీజేపీ తీరు మాత్రం మారలేదు. గత ఎన్నికల్లో 3 సీట్లే రాగా, ఈ సారి ఇంకో సీటు కోల్పోయి రెండే చోట్ల గెలిచింది. శిరోమణి అకాళీదళ్ (ఎస్ఏడీ) 15 సీట్ల నుంచి 3 సీట్లకు పడిపోయింది. బీఎస్పీ ఒకటోట, ఇండిపెండెంట్ మరో చోట గెలవగా.. ఎన్నికల ఫలితాలను తారమారు చేస్తారనుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ బొక్కబోర్లా పడ్డారు. ఎక్కడా కనీస పోటీ ఇవ్వలేదు. కనీసం తన సీటును కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు.
అతిరథులను ఓడించి..
శిరోమణి అకాళీదళ్, కాంగ్రెస్, పంజాబ్‌‌‌‌ లోక్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌లోని అతిరథ మహారథులను ఓడించి మరీ ఈ సారి అధికారాన్ని దక్కించుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రస్తుత సీఎం చరణ్‌‌‌‌జిత్ చన్నీ, మాజీ ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్, రాజిందర్ కౌర్ భట్టల్‌‌‌‌తోపాటు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌‌‌‌జ్యోత్ సిద్ధూ వంటి కీలక నేతలను ఆప్ అభ్యర్థులే ఓడించారు. అకాలీదళ్ కీలక నేతలు, ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రుల్లో చాలా వరకు ఓడిపోయారు. అమృత్‌‌‌‌సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నవ్‌‌‌‌జ్యోత్ సింగ్ సిద్ధూ.. ఆప్ అభ్యర్థి జీవన్‌‌‌‌జ్యోత్ కౌర్ చేతిలో 6,750 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58 వేల మెజారిటీతో ధురీ సెగ్మెంట్‌‌‌‌ నుంచి భగవంత్ సింగ్ మన్ గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న హర్‌‌‌‌‌‌‌‌పల్ సింగ్ చీమా.. దిర్బ సీటు నుంచి గెలిచారు. అకాళీదళ్ లీడర్ గుల్జార్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌పై 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పఠాన్‌‌‌‌కోట్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ అశ్వనీ కుమార్ శర్మ గెలుపొందారు.
42 శాతం ఓట్లు
92 సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి 42.04% ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌‌‌‌కు 22.96, అకాళీదళ్‌‌‌‌కు 18.36 శాతం, బీజేపీకి 6.6 శాతం, బీఎస్పీకి 1.78 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులు 8.26 శాతం ఓట్లు దక్కించుకున్నారు.
55 ఏండ్లలో తొలిసారి
దాదాపు 55 ఏండ్లుగా పంజాబ్‌‌‌‌లో శిరోమణి అకాళీదళ్, కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నాయి. 1966 నుంచి ఇప్పటిదాకా మిగతా పార్టీల మద్దతు లేదా కూటమితో ఈ రెండు పార్టీలు పవర్‌‌‌‌‌‌‌‌లో కొనసాగాయి. ఇన్నేండ్లలో తొలిసారిగా ఒక కొత్త పార్టీ.. ఎలాంటి కూటమి లేదా మద్దతు అవసరం లేకుండా సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఆరు దశాబ్దాల రికార్డును బద్ధలు కొట్టింది.
ఓడిన సీఎంలు, మాజీ సీఎంలు, సీఎం అభ్యర్థులు
ఈ ఎన్నికల్లో ఇద్దరు ప్రస్తుత ముఖ్యమంత్రులు, ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు, మరికొందరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోయారు. పంజాబ్‌‌‌‌లో రెండు సీట్ల నుంచి పోటీ చేసిన చరణ్‌‌‌‌జిత్ సింగ్ చన్నీ.. రెండు చోట్ల ఆప్ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. మాజీ ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, రాజిందర్ కౌర్‌‌‌‌‌‌‌‌లదీ ఇదే పరిస్థితి. ఇక ఉత్తరాఖండ్‌‌‌‌లో మొన్ననే ముఖ్యమంత్రి అయిన పుష్కర్ సింగ్ ధమీకి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ ఓడిపోయారు. 
ఆప్‌‌‌‌కు కంగ్రాట్స్: అమరీందర్
కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న కెప్టెన్ అమరీందర్ సింగ్.. కనీస ప్రభావం చూపలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిని ఒప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆప్‌‌‌‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 
భగత్‌‌‌‌ సింగ్ పుట్టిన గడ్డలో సీఎంగా భగవంత్ మన్ ప్రమాణ స్వీకారం
స్వాతంత్ర్య సమరయోధుడు, షహీద్ భగత్ సింగ్ పుట్టిన ‘ఖత్కర్ కలాన్’ గ్రామంలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ నేత, పంజాబ్ కాబోయే సీఎం భగవంత్ సింగ్ మన్ వెల్లడించారు. నవాన్‌‌‌‌షహర్ జిల్లాలోని ఖత్కర్ కలాన్‌‌‌‌లోనే తొలి కేబినెట్ మీటింగ్ జరుగుతుందని మన్‌‌‌‌ చెప్పారు. ‘‘ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్‌‌‌‌భవన్‌‌‌‌లో జరగదు. ఖత్కర్ కలాన్‌‌‌‌లోనే జరుగుతది. త్వరలోనే తేదీని ప్రకటిస్తం” అని వెల్లడించారు. ధురిలో తన గెలుపు తర్వాత కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘గతంలో నన్ను, కేజ్రీవాల్‌‌‌‌ను అవమానించిన్రు. ఇప్పుడు పెద్ద బాదల్ సాహిబ్ ఓడిపోయిండు. సుఖ్బీర్ బాదల్ కూడా ఓడిపోయిండు. కెప్టెన్, సిద్ధూ, మజీథియా, చన్నీ పరాజయం పొందారు” అని గుర్తు చేశారు. గతంలో పెద్ద పెద్ద గోడల మధ్య ప్యాలెస్‌‌‌‌లలో ప్రభుత్వం నడిచేదని, ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడా సీఎం ఫొటోలు పెట్టబోమని, భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలను మాత్రమే ఉంచుతామని తెలిపారు. 
జాతీయ పార్టీ హోదాకు రెండడుగుల దూరంలో..
జాతీయ పార్టీ హోదా పొందేందుకు ఆప్‌ రెండు అడుగుల దూరంలో నిలిచింది. నేషనల్ పార్టీ స్టేటస్ రావాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ హోదా పొందాలి. ఢిల్లీ, పంజాబ్‌‌లో ఈ పార్టీకి ఇప్పటికే ఆ హోదా ఉంది. ఇంకో రెండు రాష్ట్రాల్లో మంచి ఫలితాలను సాధిస్తే.. ఆ రెండు రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ, మొత్తంగా నేషనల్ పార్టీ హోదాలు ఒకేసారి వస్తాయి. స్టేట్ పార్టీ హోదాకు సదరు రాష్ట్రంలో 8% ఓట్లు సాధించాలి. దేశంలో ప్రస్తుతం 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. టీఎంసీ, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎన్పీపీలకు నేషనల్ పార్టీ హోదా ఉంది. జాతీయ హోదాతో అన్ని ఎన్నికల్లో ఒకే సింబల్‌తో పోటీకి దిగొచ్చు.