తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన పంజాబ్‌‌ స్పీకర్‌‌

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన పంజాబ్‌‌ స్పీకర్‌‌
  • నిర్వహణ, పనితీరును వివరించిన పోచారం శ్రీనివాస్​రెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: స్టేట్ అసెంబ్లీని మంగళవారం పంజాబ్‌‌ స్పీకర్‌‌ సర్దార్‌‌ కుల్తార్‌‌సింగ్‌‌ సంధ్వాన్‌‌ సందర్శించారు. స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌ రెడ్డి, మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అసెంబ్లీ, కౌన్సిల్‌‌ సమావేశాల నిర్వహణ, పని తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సభలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని, పద్దులపైనా సమగ్రమైన చర్చ జరుగుతోందని స్పీకర్‌‌, మండలి చైర్మన్‌‌ వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి తెలిపారు. ఈ సందర్భంగా కుల్తార్‌‌ సింగ్‌‌ను స్పీకర్‌‌, మండలి చైర్మన్‌‌ ఘనంగా సన్మానించారు. అసెంబ్లీని సందర్శించిన వారిలో పంజాబ్‌‌ ఎమ్మెల్యే కల్వంత్‌‌ సింగ్‌‌ పండోరి, మాజీ ఎమ్మెల్యే అమర్‌‌జీత్‌‌ సింగ్‌‌ ఉన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌‌ గుప్తా, అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్‌‌ వి.నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

మౌనిక చదువు బాధ్యత నాదే: పోచారం

పార్లమెంట్‌‌ సెంట్రల్‌‌ హాల్‌‌లో 25న నిర్వహించిన యూత్‌‌ పార్లమెంట్‌‌లో ప్రసంగించిన కేతావత్‌‌ మౌనికను స్పీకర్‌‌ పోచారం శ్రీనివాస్‌‌ రెడ్డి అభినందించారు. కామారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన మౌనిక, కామారెడ్డిలోని ఆర్‌‌కే పీజీ కాలేజీలో ఎంఎస్‌‌డబ్ల్యూ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతున్నది. గుడ్‌‌ గవర్నెర్స్‌‌ డే సందర్భంగా పార్లమెంట్‌‌ సెంట్రల్‌‌ హాల్‌‌లో ఏడుగురికి ప్రసంగించే అవకాశం లభించగా, తెలంగాణ నుంచి మౌనిక ఒక్కరే ఎంపికయ్యారు. మౌనిక తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం అసెంబ్లీలో స్పీకర్‌‌ను కలిశారు. 

మౌనిక చదువుతో పాటు సివిల్స్‌‌ కోచింగ్‌‌కు అయ్యే ఖర్చు తానే భరిస్తానని తెలిపారు. మౌనిక ఢిల్లీలో తెలంగాణ పేరు ప్రతిష్టలు చాటిందని కొనియాడారు. తన గ్రామానికే చెందిన మౌనిక, పార్లమెంట్‌‌ సెంట్రల్‌‌ హాల్‌‌లో ప్రసంగించడం గొప్ప విషయమన్నారు. ఆదర్శ రాజకీయ నాయకుడు, వివాద రహితుడు అయిన వాజ్​పేయి గురించి మౌనిక మాట్లాడిందన్నారు. మంచి భాషా పరిజ్ఞానంతో అందరినీ ఆకట్టుకున్నారని తెలిపారు. పంజాబ్‌‌ స్పీకర్‌‌ కుల్తార్‌‌ సింగ్‌‌, మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డితో కలిసి మౌనికను స్పీకర్‌‌ పోచారం ఘనంగా సత్కరించారు.