42 ఏళ్లకే ఫేమస్ బాడీబిల్డర్, నటుడు గుండెపోటుతో మృతి.. వ్యాయామ వీడియోలతో యువతలో ఉత్సాహాం..

42 ఏళ్లకే ఫేమస్ బాడీబిల్డర్, నటుడు గుండెపోటుతో మృతి.. వ్యాయామ వీడియోలతో యువతలో ఉత్సాహాం..

పంజాబీ నటుడు, ప్రొఫెషనల్ బాడీబిల్డర్ వరీందర్ ఘుమాన్ (Varinder Ghuman) గుండెపోటుతో మరణించారు. గురువారం సాయంత్రం (అక్టోబర్ 9న) ఆసుపత్రిలో సడెన్గా గుండెపోటు రావడంతో వరీందర్ తుదిశ్వాస విడిచారు. ఇండియాలోనే ఉత్తమ శాఖాహార బాడీబిల్డర్గా గుర్తింపు పొందిన ఘుమాన్ వయస్సు కేవలం 42 ఏళ్లు మాత్రమే. ఇలా ఘుమాన్ సడెన్ హార్ట్ ఎటాక్తో మరణించడం పట్ల, ఆయన అభిమానులు, సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ క్రమంలో సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ ద్వారా విచారం వ్యక్తం చేస్తున్నారు.

వరీందర్ మరణ వార్తను ఆయన మేనల్లుడు అమన్‌జోత్ సింగ్ ఘుమాన్ జలంధర్‌లో విలేకరులతో మాట్లాడుతూ పంచుకున్నారు. "వరీందర్‌కి ఇటీవల భుజం నొప్పి ఉండగా, చికిత్స కోసం అమృత్‌సర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారని తెలిపారు. అలాగే, ఈ విషయాన్ని ఆయన మేనేజర్ యద్వీందర్ సింగ్ సైతం ధృవీకరించారు.

ఈ క్రమంలోనే పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు పార్లమెంటు సభ్యుడు సుక్జిందర్ సింగ్ రంధావా, ప్రముఖ హాకీ ప్లేయర్, రాజకీయ నాయకుడు పర్గత్ సింగ్ గురువారం సాయంత్రం తమ X ఖాతాలో పంచుకున్నారు. వరీందర్ ఘుమాన్, బాలీవుడ్‌ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ (2023) లో కీలక పాత్ర పోషించి సినీ ప్రియులకి సుపరిచుతులయ్యారు. 

బాడీబిల్డర్ వరీందర్ ఘుమాన్:

గురుదాస్‌పూర్‌కు చెందిన వరీందర్ ప్రస్తుతం జలంధర్‌లో నివసిస్తున్నారు. అక్కడ ఆయనకు జిమ్ కూడా ఉంది.  ‘శాఖాహార బాడీబిల్డర్’గా పేరుగాంచిన ఆయన ఫిట్‌నెస్ పట్ల మక్కువ కలిగి ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యాయామ వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తూ ఆకట్టుకునేవారు. 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న ఘుమాన్ 2009లో మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆపై మిస్టర్ ఆసియా పోటీలో రెండవ స్థానాన్ని పొందాడు. ఆ తర్వాత సినిమాల్లో, రాజకీయాల్లో క్రియాశీలకంగా రాణిస్తున్నారు. 

వరీందర్ ఘుమాన్ సినిమాలు:

 2012లో పంజాబీ సినిమా ‘కబడ్డీ వన్స్ ఎగైన్’లో నటించి అక్కడి వారికి దగ్గరయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశం రావడంతో తిరిగి వెనక్కి చూసుకోకుండా తనకి సెట్ అయ్యే రోల్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ‘రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్‌బన్స్’ (2014),  ‘మర్జావాన్’ (2019), సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ (2023) లో కీలక పాత్ర పోషించారు.

అయితే, వరీందర్ ఘుమాన్.. 2027లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలనే కోరికను కూడా ఉన్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతలోనే ఆయన చనిపోవడం రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. పార్టీలకు అతీతంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పిస్తున్నారు.