
దార్ల పోతుంటే ఓ పర్సు దొరికింది. దాంట్ల ఓ వెయ్యి రూపాయలున్నాయి! దొరికిన వ్యక్తికి అదృష్టం.. పోగొట్టుకున్న వ్యక్తికి దు:ఖం. కానీ, ఇక్కడే సీన్ రివర్స్! దునియాల జనం నీతిమంతులైండ్రట. మనకెందుకులే ఆ పర్సు అని.. పోగొట్టుకున్న వ్యక్తికి నిజాయితీగా ఆ పర్సును తిరిగిచ్చేస్తున్నరట.
అనుకున్నదానికన్నా జనంలో నిజాయితీ ఎక్కువగా ఉందట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ సైంటిస్టులు 40 దేశాల్లోని 355 నగరాల్లో పోయిన 17 వేల పర్సులపై సర్వే చేసి ఈ విషయాన్ని తేల్చారు. పర్సుల్లో పైసలు ఎక్కువగా ఉంటే మరింత నిజాయితీగా ఉంటున్నారని సైంటిస్టులు గుర్తించారు. పోస్టాఫీసులు, బ్యాంకులు, మ్యూజియంలు, ఇతర పెద్ద సంస్థల ముందు రోడ్డు మీద పడి ఉన్న పర్సులను ఆయా సంస్థల్లోని రిసెప్షన్లలో జనం అప్పగిస్తున్నారని వివరించారు. బిజినెస్ కార్డులు, బ్యాంకు కార్డులు, ఇతరత్రా ముఖ్యమైన డాక్యుమెంట్లుంటే ఆ పర్సులను పోగొట్టుకున్న వారికి ఈజీగా తిరిగిచ్చేస్తున్నారని తేల్చారు. 40 దేశాల్లోని 38 దేశాల జనం చాలా నిజాయితీగా ఉంటున్నారని చెప్పారు. 100 డాలర్ల వరకు పైసలుంటే,
ఆ పర్సులను తిరిగిచ్చేస్తున్న రేటు, మామూలు పర్సులను తిరిగిచ్చేస్తున్న రేటు కన్నా 18 శాతం ఎక్కువగా ఉందంటున్నారు. అంటే డబ్బులు ఎంత ఎక్కువుంటే అంతలా జనాల్లో నిజాయితీ ఎక్కువగా ఉంటోందట. దానికి కారణం, తెలియని వ్యక్తి అయినా సరే ‘స్వార్థం లేకుండా’ జనం వ్యవహరిస్తున్న తీరు ఒకటి కాగా, నిజాయితీగా జనం ఉండాలనుకోవడం ఇంకో కారణమని వివరిస్తున్నారు.
దొంగ అన్న ముద్ర పడకూడదని
ఒకవేళ ఆ పర్సును ఉంచేసుకుంటే ఎక్కడ ‘దొంగ’ అన్న ముద్ర పడుతుందోనన్న భయమూ జనాన్ని ఈ దిశగా ప్రోత్సహిస్తోందని సైంటిస్టులు తేల్చారు. అంతేకాదు, పోయిన వస్తువులపై స్థానికంగా ఉన్న చట్టాలూ పోగొట్టుకున్న పర్సులను తిరిగిచ్చేలా చేస్తున్నాయట. అయితే, పర్సులను తిరిగిచ్చేస్తున్న శాతం దేశదేశానికి తేడా ఉందని అంటున్నారు. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ 74%తో ఫస్ట్ ర్యాంకును సాధించగా, ఇండియా 30వ స్థానంలో నిలిచింది. మన దేశంలో పైసల్లేని పర్సులు తిరిగి ఓనర్ దగ్గరకు చేరుతున్నవి 22 శాతం కాగా, పైసలున్న పర్సులను 44 శాతం వరకూ జనం తిరిగిచ్చేస్తున్నారు. స్విట్జర్లాండ్లో పైసలున్నా లేకపోయినా ఎక్కువ శాతం ఓనర్కు పర్సులను తిరిగిస్తున్నారు. పైసల్లేని పర్సుల విషయానికొస్తే ఆ రేట్ 74 శాతం ఉండగా, పైసలున్న పర్సులు తిరిగి ఓనర్కు చేరుతున్నది 79 శాతం. ఈ జాబితాలో 71%, 79 శాతంతో నార్వే రెండో స్థానంలో ఉంది. అట్టడుగు స్థానంలో చైనా నిలిచింది. ఆ దేశంలో ఆ రేటు, 7%, 22 శాతంగా ఉంది. ఇలా పర్సులను తిరిగిచ్చేయడం మంచిదే అయినా, తిరిగివ్వనోళ్లు చాలా మందే ఉన్నారని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.