విమర్శలు మాని కేంద్రంపై ఒత్తిడి తెండి: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి

విమర్శలు మాని కేంద్రంపై ఒత్తిడి తెండి: వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి

ఆమనగల్లు, వెలుగు: అనవసర విమర్శలు మాని ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి బీజేపీ నేతలకు సూచించారు.   బండి, గుండోడు, గుడ్లోడు ఎగిరెగిరి పడ్తూ స్టేట్​ గవర్నమెంట్​మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏడేళ్ళుగా ఓపికగా ఉన్నామని, ఇక వారిపై యుద్ధం చేస్తామని హెచ్చరించారు.  సోమవారం ఆమనగల్లులో రైతు వేదిక , వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. లైబ్రరీ బిల్డింగ్​,  ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ సముదాయానికి మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన మీటింగ్​లో  మంత్రి నిరంజన్​ రెడ్డి మాట్లాడారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పెంచిన పెట్రోల్​, డీజిల్​రేట్లపై పోరాడాలని సూచించారు. కేసీఆర్​ చొరవతో తీసుకున్న చర్యల వల్ల  దేశంలోనే వరి దిగుబడుల్లో రాష్ర్టం అగ్రస్థానంలో ఉందన్నారు. పంజాబ్​లో  పండిన వడ్లను పూర్తిగా కొంటున్న కేంద్రం తెలంగాణ నుంచి కొనకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వంద జాకీలు పెట్టినా లేవలేనిస్థితిలోఉన్న కాంగ్రెస్​ను ప్రజలు నమ్మబోరన్నారు.  ఎన్ని అవాంతాలు సృష్టించినా  పాలమూరు,రంగారెడ్డి లిఫ్ట్​ను  సీఎం కేసీఆర్​పూర్తి చేసి తీరుతారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.  ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఆశీర్వదించాలని కోరారు. నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్​పర్సన్​ అనితా రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.  
మంత్రులకు నిరసన సెగ
ప్రజలు కోరుకుంటున్న చోట కాకుండా ఆమనగల్లులో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి  భూమి పూజ చేసిన మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి,  నిరంజన్​ రెడ్డిలకు నిరసన సెగ తాకింది.  మంత్రుల కాన్వాయిని  ప్రధాన కూడలి వద్ద అడ్డుకునేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా,  వారిని రోడ్డు మీదికి రాకుండా పోలీసులు నిలువరించారు. వారిని  పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.