మోదీకి పుతిన్ ​ఫోన్.. ఉగ్రవాదంపై పోరులో కలిసివస్తామని ప్రకటన

మోదీకి పుతిన్ ​ఫోన్.. ఉగ్రవాదంపై పోరులో కలిసివస్తామని ప్రకటన
  • పహల్గాం దాడిని ఖండించిన రష్యా ప్రెసిడెంట్
  • త్వరలో ఇండియా పర్యటన

న్యూఢిల్లీ: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనాగరికమని, ఈ దాడిని ఖండిస్తున్నామని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఈ దాడిలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఈమేరకు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా ప్రెసిడెంట్ ఫోన్ చేశారని, ఉగ్రవాదంపై పోరుకు రష్యా మద్దతిస్తుందని చెప్పారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్​లో పర్యటించాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని పుతిన్ మన్నించారని, త్వరలోనే ఆయన ఇండియాకు రానున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 

కాగా, పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22న టెర్రరిస్టులు దాడి చేసి పర్యాటకులు సహా 26 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పుతిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారని జైస్వాల్ చెప్పారు. నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. టెర్రరిజంపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరాన్ని ఇద్దరు నాయకులు నొక్కిచెప్పారని వివరించారు. ఉగ్రవాద దాడిని పుతిన్  తీవ్రంగా ఖండించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన సంతాపం తెలిపారని చెప్పారు. 

భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి మోదీ, పుతిన్ తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అలాగే, ఈ నెల 9న రష్యా 80వ విక్టరీ డే పురస్కరించుకుని పుతిన్‌‌‌‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం భారతదేశంలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్​ను ప్రధానమంత్రి మోదీ ఆహ్వానించారని.. అందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని జైస్వాల్ చెప్పారు.