‘మదర్ హీరోయిన్’ పురస్కారాన్ని పునరుద్ధరించిన పుతిన్  

‘మదర్ హీరోయిన్’ పురస్కారాన్ని పునరుద్ధరించిన పుతిన్  

మాస్కో: రష్యాలో 10 మంది పిల్లలను కన్న మహిళలను ‘మదర్ హీరోయిన్’ పురస్కారంతో గౌరవిస్తామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అవార్డు గెలుచుకున్న మహిళలకు 10 లక్షల రూబుల్స్ (రూ. 13 లక్షలు) క్యాష్ ప్రైజ్​గా అందజేస్తామని వెల్లడించారు. రష్యాలో ఏటా బర్త్ రేట్ పడిపోతూ, డెత్ రేట్ పెరుగుతుండటంతో జనాభా క్రమంగా తగ్గిపోతోంది. దీంతో జనాభాను మళ్లీ పెంచేందుకు సోవియెట్ కాలం నాటి ‘మదర్ హీరోయిన్’ అవార్డును తిరిగి ప్రవేశపెడ్తూ పుతిన్ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రష్యా జనాభా భారీగా తగ్గిపోవడంతో 1944లో అప్పటి సోవియెట్ యూనియన్ లీడర్ జోసెఫ్ స్టాలిన్ మొదటిసారిగా ఈ అవార్డును ప్రకటించారు. 1991లో ఈ అవార్డును రద్దుచేశారు.

పిల్లలందరూ బతికుంటేనే.. 

పుతిన్ జారీ చేసిన డిక్రీ ప్రకారం.. 10 మంది పిల్లలను కన్న మహిళలు ఈ అవార్డుకు అర్హులు. పదో బిడ్డ మొదటి పుట్టిన రోజున ఆ మహిళకు అవార్డును, క్యాష్ ప్రైజ్ ను అందజేస్తారు. అయితే, అప్పటివరకూ 10 మంది పిల్లలూ బతికి ఉండాలన్న షరతు పెట్టారు. ఒకవేళ ఆ పిల్లల్లో ఎవరైనా యుద్ధంలోనో,  టెర్రరిస్ట్ అటాక్​లోనో  చనిపోతే మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అయితే, పుతిన్ అవార్డుపై రష్యన్ పాలిటిక్స్, సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ డాక్టర్ జెన్నీ మాథర్స్ పెదవివిరుస్తున్నారు. 10 లక్షల రూబుల్స్ కోసం పది మంది పిల్లలను కని, పెంచేంతటి వ్యయ, ప్రయాసలు ఎవరు పడతారని ఆమె  ప్రశ్నిస్తున్నారు.

రష్యా జనాభా 14.60 కోట్లే 

రష్యా జనాభా కొన్నేండ్లుగా తగ్గిపోతోంది. 1990లో 15 కోట్ల జనాభా ఉండేది. 2018లో క్రీమియా (ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న ఐల్యాండ్)లో ఉన్న 86 వేల మందితో కలిపి రష్యాలో 14.70 కోట్ల మంది ఉన్నారు. కరోనా వచ్చిన నుంచి దేశ జనాభా మరింత వేగంగా పడిపోతోంది. దేశంలో కరోనా బారినపడి 3.83 లక్షల మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల 50 వేల మంది సోల్జర్లను రష్యా పోగొట్టుకున్నట్లు అంచనా. దేశంలో కొన్నేండ్లుగా హై డెత్ రేట్, లో బర్త్ రేట్​తో పాటు అబార్షన్లు కూడా భారీగా నమోదవుతున్నాయి. దేశంలో ఏటా 14 లక్షల జననాలు నమోదవుతుంటే.. 8 లక్షల మరణాలు రికార్డ్ అవుతున్నాయి. మరోవైపు దేశంలోకి వలసలు కూడా చాలా తక్కువ. ఇలా అన్ని కారణాల వల్ల ప్రస్తుతం దేశ జనాభా 14.60 కోట్లకు పడిపోయింది.