దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన మహానుభావుడు పీవీ : బూర నర్సయ్య

దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన మహానుభావుడు పీవీ : బూర నర్సయ్య

దేశంలో పార్టీల కంటే, రాజకీయాల కంటే దేశం కోసం సేవ చేసిన గొప్ప వ్యక్తి పీవీ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రశంసించారు. మాజీ ప్రధానికి బీజేపీ తరుపున ఘన నివాళులు అర్పించిన ఆయన.. దేశం కోసం సేవ చేసిన వారు నలుగురు మాత్రమే ఉన్నారని.. వారే సర్ధార్, వాజ్ పేయి, పీవీ, మోడీ అని చెప్పారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన మహానుభావుడు అని కొనియాడారు. మాజీ ప్రధాని, ఆరాధ్య నాయకుడు పీవీ అని, గొప్ప ఆర్థిక సంస్కరణ నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి అని మెచ్చుకున్నారు. 

భారత దేశాన్ని గట్టెకించిన గొప్ప వారని, మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నా దేశం ముఖ్యమని నిర్ణయాలు తీసుకున్నారని బూర నర్సయ్య అన్నారు. అయోధ్యలో రామ మందిరం సమస్యకు పీవీ పరిష్కారం చూపించారని ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్టంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణలకు పెద్ద పీట వేసిన మహా వ్యక్తి పీవీ అన్న బూర నర్సయ్య... విద్యా వ్యవస్థల్లో గురుకుల పాఠశాల సర్వేలు మొదలు పెట్టిన వారు పీవీ అని చెప్పారు. వారసత్వ నాయకత్వం కోరుకోలేదని, అవినీతి మచ్చ లేకుండా ఎదిగారని తెలిపారు. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం అని ఆయన వివరించారు

దశ- దిశ నిర్దేశించే మహానుభావుడు.. పీవీ

ఇవాళ తెలంగాణ ముద్దు బిడ్డ., మేధావి వర్థంతి అని ఎమ్మెల్సీ వాణీ దేవి అన్నారు. అనేక క్లిష్ట పరిస్థితులలో దేశాన్ని కాపాడారని, ప్రధానిగా అనేక సంస్కరణలు చేశారని చెప్పారు. తెలుగు వారు గౌరవించదగ్గ మేధావి అని కీర్తించారు. దశ- దిశా నిర్దేశించే మహానుభావుడు అని వాణీ దేవి అన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశ ప్రధానిగా నిలిచిన ఆయన ఎందరికో ఆదర్శమని కొనియాడారు. మహాత్మా గాంధీలా అహింసా మార్గంలో నడిచి దేశానికి సేవ చేసిన గోప్ప వ్యక్తి అని, రాజకీయాల్లోకి వచ్చే వారు ఆయన చేసిన సేవ గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ సారైనా పీవీకి భారత రత్న ఇవ్వాలని వాణీ దేవీ డిమాండ్ చేశారు.