ప్రతిపక్ష నేతను ఐరాసకు పంపి..

ప్రతిపక్ష నేతను ఐరాసకు పంపి..

న్యూఢిల్లీ: రాజకీయంగా బద్ధశత్రువుల్లాంటి పార్టీల్లో ఉన్నా.. పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయి రెండు సందర్భాల్లో దేశం కోసం ఒకరితో ఒకరు చేతులు కలిపారు. ముందుగా 1994లో పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో.. కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ (యూఎన్ హెచ్ఆర్ సీ)లో పాకిస్తాన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ఓడగొట్టేందుకు అప్పటి ప్రతిపక్ష నేత వాజ్ పేయి నేతృత్వంలోని బృందాన్ని పీవీ పంపగా, తీర్మానం వీగిపోయేలా చేసి వాజ్ పేయి దీటుగా బదులిచ్చారు. అయితే, ప్రతిపక్ష నేత కింద పని చేయాల్సి రావడం పట్ల అప్పటి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో పీవీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అలాగే పీవీ హయాంలోనే అణు పరీక్షలకు సిద్ధపడినా.. అమెరికా ఒత్తిడి కారణంగా వీలు కాలేదు. తర్వాత 1996 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సంకీర్ణ కూటమిగా అధికారంలోకి వచ్చింది. వాజ్ పేయి అణు పరీక్షలు జరిపే అవకాశం ఉందని, ఆయన ప్రధాని కాకుండా చూడాలని అమెరికా లాబీయింగ్ సైతం చేసిన విషయం పీవీ దృష్టికి వచ్చింది. దీంతో వాజ్ పేయి ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరైన పీవీ.. సీక్రెట్ గా ఆయనకు ఓ చిట్టీని అందజేశారు. అందులో ‘‘కలాంను కలవండి” అని రాసి ఉంది. కలాం ఎవరో తెలియక వాజ్ పేయి ఆశ్చర్యపోయారు. ప్రధాన మంత్రి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్డీవో సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తే కలాం అని తెలుసుకుని ఆయనతో భేటీ అయ్యారు. అమెరికాకు తెలియకుండా అణు పరీక్షలు చేపట్టాలని పీవీ సూచించినట్లు కలాం తెలిపారు.

కానీ వెంటనే వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడంతో అది సాధ్యం కాలేదు. కానీ వాజ్ పేయి మళ్లీ 1998లో తిరిగి ప్రధాని అయిన వెంటనే కలాం సారథ్యంలో సీక్రెట్ గా అణు పరీక్షలు చేసి అమెరికాకు షాక్ ఇచ్చారు. ఈ ఆసక్తికరమైన విషయాలను వాజ్ పేయికి మీడియా అడ్వైజర్ గా పని చేసిన అశోక్ టాండన్ ‘‘రివర్స్ స్వింగ్: కలోనియలిజం టు కోఆపరేషన్” అనే పుస్తకంలో వివరించారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి కూడా ఒక సందర్భంలో ఈ వివరాలను వెల్లడించారు.