
టోక్యో: ఇండియా స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు చెత్తాట కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఐదో టోర్నీలోనూ తను తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. జపాన్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి పోరులో 30 ఏళ్ల సింధు 15–21, 14–21తో సిమ్ యు జిన్ (కొరియా) చేతిలో ఓడింది. ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న సింధు ఈ మ్యాచ్‌లోనూ వరుసగా తప్పిదాలు చేసింది తొలి గేమ్ మధ్యలో సింధు కొంత పోరాటం చూపెట్టినా.. నియంత్రణతో కూడిన షాట్లను సంధించిన సిమ్ ఎక్కడా స్కోరు సమం చేసే చాన్స్ ఇవ్వలేదు. ఓ దశలో సింధు 12–13తో దగ్గరకు వచ్చినా సక్సెస్ కాలేదు. చివరకు 16–14 స్కోరు వద్ద సిమ్ వరుసగా నాలుగు, ఒక పాయింట్ గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో 1–6తో వెనకబడ్డ సింధు ఆ తర్వాత క్రాస్ కోర్టు విన్నర్లతో 7–7, 10–10, 11–11తో స్కోరు సమం చేసింది.
కానీ లైన్ జడ్జిమెంట్‌లో చేసిన తప్పిదాలు ఇండియన్ ప్లేయర్‌కు ఇబ్బందిగా మారాయి. సిమ్ కొట్టిన బేస్ లైన్ షాట్లను గుర్తించడంలో ఫెయిలైంది. దాంతో సిమ్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 15–11తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒక్కో పాయింట్‌తో 17–14తో నిలిచింది. ఈ దశలో సిమ్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌తో పాటు మ్యాచ్ నెగ్గింది. మరో మ్యాచ్‌లో అనుపమ ఉపాధ్యాయ 21–15, 18–21, 21–18తో రక్షితశ్రీ (ఇండియా)పై పోరాడి నెగ్గింది. కానీ, ఉన్నతి హుడా 8–21, 12–21తో పోర్న్‌పావీ చొచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. విమెన్స్ డబుల్స్‌లో కవిప్రియా సెల్వమ్–సిమ్రాన్ సింగి 6–21, 15–21తో లుయ్ లోక్ లోక్– సో సియోంగ్ జే (హాంకాంగ్) చేతిలో కంగుతిన్నారు.
లక్ష్య అదుర్స్..
మెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ 18వ ర్యాంకర్ లక్ష్యసేన్ 21–11, 21–18తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)పై సూపర్ విక్టరీ సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. 43 నిమిషాల మ్యాచ్‌లో సేన్.. తన ప్రత్యర్థికి ఎక్కడా పుంజుకునే చాన్స్ ఇవ్వలేదు. 5–0తో తొలి గేమ్ మొదలుపెట్టిన ఇండియన్ 12–3, 14–6, 16–8, 18–9తో దూసుకుపోయాడు. ఈ టైమ్‌లో జింగ్ రెండు పాయింట్లు సాధించినా వెంటనే తేరుకున్న లక్ష్య వరుసగా మూడు పాయింట్లు గెలిచాడు. రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్న జింగ్ కాసేపు ప్రతిఘటించాడు. కానీ 3–3తో స్కోరు సమం చేసినా ఆ తర్వాత మళ్లీ దాన్ని రిపీట్ చేయలేకపోయాడు. ఒకటి, రెండు పాయింట్ల అంతరంతో వెనకబడిపోయాడు.
దాంతో లక్ష్యసేన్ 7–4, 13–10, 16–11, 18–16, 20–17తో నిలిచాడు.
చివర్లో ఒక గేమ్ పాయింట్‌ను కాపాడుకున్న లక్ష్య ఈజీగా విజయం సాధించాడు. తర్వాతి మ్యాచ్‌లో లక్ష్యసేన్.. కొడాయ్ నరోకా (జపాన్)తో తలపడతాడు. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 21–18, 21–10తో కాంగ్ మిన్ హుయక్–కిమ్ డాంగ్ జు (కొనియా)పై నెగ్గారు. 42 నిమిషాల మ్యాచ్‌లో.. తొలి గేమ్‌లో కుదురుకోవడానికి కాస్త టైమ్ తీసుకున్న ఇండియా కుర్రాళ్లు తర్వాత తమ ట్రేడ్ మార్క్ ఆటతో రెచ్చిపోయారు. తొలి గేమ్‌లో 13–13 తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌లో 2–2 తర్వాత వరుస పాయింట్లతో హోరెత్తించారు. మరో మ్యాచ్‌లో హరిహరన్–రుబన్ కుమార్ 15–21, 9–21తో మూడోసీడ్ కిమ్ వోన్ హో–సియో సియోంగ్ జే (కొరియా) చేతిలో ఓడారు.