పీవీ సింధుకు బిగ్ షాక్.. జపాన్ ఓపెన్‎లో తొలి రౌండ్‎లోనే ఓటమి

పీవీ సింధుకు బిగ్ షాక్.. జపాన్ ఓపెన్‎లో తొలి రౌండ్‎లోనే ఓటమి

టోక్యో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి తీవ్రంగా నిరాశపర్చింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‎లోనే ఓటమి పాలై ఇంటి బాటపట్టింది. బుధవారం (జూలై 16) జరిగిన ఉమెన్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచులో 15-21, 14-21 తేడాతో సింధును చిత్తు చేసింది కొరియాకు చెందిన సిమ్ యు జిన్. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు ప్రత్యర్థి సిమ్ యు జిన్ ముందు తేలిపోయింది. 

గత కొంత కాలంగా ఫామ్‎లేమితో ఇబ్బంది పడుతోన్న భారత షట్లర్.. ఈ మ్యాచులోనూ సరైన లయ అందుకోలేకపోయింది. రెండు రౌండ్లలో స్పష్టమైన అధిక్యం కనబర్చిన సిమ్ యు జిన్ అద్భుత విజయంతో టోర్నీలో అడుగు ముందుకేసింది. తొలి గేములో ముందుగా 3-9తో వెనుకబడిన సింధు ఆ తర్వాత 12-13తో పోటీలోకి వచ్చింది. కానీ చివరి వరకు అదే పోరాటాన్ని కొనసాగించడంలో విఫలమై ఫస్ట్ సెట్ కోల్పోయింది.

ఇక, రెండో గేములో 7-7, 11-11తో ప్రత్యర్థికి పోటీనిచ్చినా సింధు.. అనవసర తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. వరుసగా రెండు సెట్లు కోల్పోయి తొలి దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‎లో తొలి రౌండ్‎లోనే సింధు ఓటమి పాలు కావడం ఇది నాలుగోసారి. 2025 జనవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరుకోవడమే ఈ ఏడాది సింధు అత్యుత్తమ ప్రదర్శన. 

ఇక, ఇదే జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్, పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. తొలి రౌండ్‎లో విజయం సాధించి రెండో రౌండ్‎కు దూసుకెళ్లారు. లక్ష్య సేన్ చైనాకు చెందిన వాంగ్ జెంగ్ జింగ్‌ను 21-11, 21-18 తేడాతో ఓడించి టోర్నీలో ముందడుగేశాడు. తొలి సెట్ సునాయంగా నెగ్గిన లక్ష్య సేన్‏కు రెండో సెట్‎లో ప్రత్యర్థి నుంచి కాస్తా ప్రతిఘటన ఎదురైంది. 

ALSO READ : IND vs ENG 2025: లార్డ్స్ టెస్టులో కోహ్లీ ఉంటే టీమిండియా గెలిచేది: స్టార్ క్రికెటర్ భార్య

కానీ బలమైన షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి రెండో సెట్‎ను కూడా గెలిచాడు. 16వ రౌండ్‌లో జపాన్‌కు చెందిన ఏడవ సీడ్ కోడై నరోకాను లక్ష్య సేన్ ఎదుర్కొననున్నాడు. ఇక, పురుషుల స్టార్ జోడీ సాత్విక్, చిరాగ్‌ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్, కిమ్ డాంగ్ జులను 21-18, 21-10 తేడాతో ఓడించారు. కేవలం 42 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించి నెక్ట్స్ రౌండ్‎కు దూసుకెళ్లారు.