జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. వరుసగా రెండో టోర్నీలోనూ నిరాశపర్చింది. ఇండోనేసియా ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 17–21, 14–21తో వరల్డ్ నంబర్‌వన్ అన్ సి యంగ్ (కొరియా) చేతిలో ఓడింది. రెండు వారాల్లో అన్ సి యంగ్ చేతిలో సింధు ఓడటం ఇది రెండోసారి కాగా ఓవరాల్‌గా పదో ఓటమి. 44 నిమిషాల మ్యాచ్‌లో సింధు ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయింది. తొలి గేమ్ 10–10 ఉన్న దశలో పవర్‌ఫుల్ స్మాష్‌లతో తెలుగమ్మాయి రెచ్చిపోయినా చివర్లో యంగ్ దాటిని తట్టుకోలేకపోయింది.
రెండో గేమ్‌లో యంగ్ మరింత దూకుడుగా ఆడటంతో 6–13తో వెనకబడ్డ సింధు కోలుకోలేకపోయింది. మెన్స్ సింగిల్స్‌లో ఆయుశ్ షెట్టి 21–16, 13–21, 14–21తో లీ చుక్ యి (హాంకాంగ్) చేతిలో, మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్–రుత్విక శివాని 13–21, 12–21తో థామ్ గిక్వెల్–డెల్ఫైన్ డెల్రూ (థాయ్‌లాండ్) చేతిలో ఓడారు. మెన్స్ డబుల్స్‌లో హరిహరన్–ఎం.ఆర్. అర్జున్ 16–21, 21–15, 21–19తో కాంగ్ కాయ్ జింగ్–అరోన్ టాయ్ (మలేసియా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
