పీవీ సింధు..45 రోజుల ‘స్వర్ణ’ దీక్ష

పీవీ సింధు..45 రోజుల ‘స్వర్ణ’ దీక్ష

హైదరాబాద్: ‘ఈసారి మెడల్ రంగు మార్చుకొస్తా’ అంటూ ప్రపంచ బ్యాడ్మింటన్‌‌‌‌ టోర్నీ ముందు ధీమా వ్యక్తం చేసిన సింధు.. అన్నట్లుగా గెలిచి మాటనిలబెట్టుకుంది. ఆమె అంత ధీమాగా మాట్లాడటం వెనుక కఠోర శ్రమ ఉంది. ఎంత కష్టమంటే మొబైల్ ఫోన్ పక్కకు పెట్టి కోచ్‌‌‌‌లు ఏది చెబితే అది మాటమాట్లాడకుండా చేసినంత. లోపాలను అధిగమించడానికి ఎంత దూరమైనా ప్రయాణం చేసే అంత.  ఫైనల్‌‌‌‌ ఫోబియా అంటూ విమర్శకుల మాటలు సింధు మనస్సుకు తూటాల్లా తాకాయి. ఈసారి కచ్చితంగా నెగ్గాల్సిందే… ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కుదరదనుకున్న సింధు.. 45 రోజులు ‘స్వర్ణ’ దీక్ష చేపట్టింది. తన లోపాలపై సీరియస్‌‌‌‌గా దృష్టి సారించింది. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికోసం స్ట్రెంత్ ట్రైనర్ శ్రీకాంత్‌‌‌‌ వర్మ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఈ ట్రైనింగ్‌‌‌‌ కోసం గచ్చిబౌలిలోని గోపిచంద్‌‌‌‌ అకాడమీ నుంచి  సుచిత్ర వరకు సింధు రానుపోను రోజు 60 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ… హైదరాబాద్‌‌‌‌ ట్రాఫిక్‌‌‌‌తో కుస్తీ చేసింది.

2017లో 27 రోజులే..

సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో పనిచేస్తున్న శ్రీకాంత్‌‌‌‌.. ఆ అకాడమీ ఓనర్ ప్రవీణ్ రాజు ద్వారా సింధు తండ్రి పీవీ రమణకు పరిచయమయ్యాడు. ఎన్‌‌‌‌ఐఎస్‌‌‌‌ సర్టిఫైడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ అయిన శ్రీకాంత్​ 2017 వరల్డ్‌‌‌‌చాంపియన్‌‌‌‌కు ముందు 27 రోజుల పాటు సింధుకు ట్రైనింగ్​ ఇచ్చాడు.  ఆమె శరీరంలో అద్భుత శక్తి ఉందని, త్వరగా కోలుకునే తత్వం ఉందని, ఎంత కఠోర కసరత్తులు చేసిన ఆమె హార్ట్‌‌‌‌బీట్‌‌‌‌ సాధారణంగా ఉండటాన్ని శ్రీకాంత్ గ్రహించాడు. ఆ కొద్ది రోజుల శిక్షణతోనే  సింధు నాటి ఫైనల్లో 110 నిమిషాల పాటు పోరాడింది. దీంతో మరోసారి అతని శిక్షణలో  రాటుదేలాలనుకుంది. ఈ వరల్డ్​ చాంపియన్​షిప్​కు ముందు 45 రోజుల పాటు  తీవ్ర కసరత్తులు చేసింది.  సింధు శరీరంలో కొన్ని బలహీనతలను గుర్తించిన శ్రీకాంత్ ఈ సారి ఆదిశగా ట్రైన్‌‌‌‌ చేశాడు.  ఆ ఫలితం ఈ మెగా టోర్నీలో కనిపించింది. ‘ గత రెండు నెలలుగా సింధు తీవ్రంగా కష్టపడింది. చాంపియన్‌‌‌‌గా నిలవడం కోసం తన మొబైల్‌‌‌‌నే పక్కన పెట్టింది. ఆఖరికి తన నంబర్‌‌‌‌‌‌‌‌ను కూడా మార్చింది. కోచ్‌‌‌‌లుగా మేం ఏది చెబితే అది ఎదురు చెప్పకుండా చేసింది. కోర్టుల కొరతతో ఎర్రటి బురద కోర్టులపై ఆడటానికి వెనుకాడలేదు. ఆమె మంచి లిజనర్’ అంటూ సింధును  శ్రీకాంత్ కొనియాడాడు. ఇంతలా శ్రమించిన సింధు కష్టం వృథా పోలేదు. ఆమె ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లెవెల్స్‌‌‌‌ అమాతం పెరిగాయి. చివర్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఆరంభం నుంచే దూకుడుగా ఆడి విజయాన్ని అందుకుంది.  సింధు కూడా శ్రీకాంత్‌‌‌‌ కష్టాన్ని మరవలేదు. విశ్వవేదికగా పసిడి గెలిచిన అనంతరం.. తనను ఫిట్‌‌‌‌గా తయారు చేసిన శ్రీకాంత్‌‌‌‌కు థ్యాంక్స్​ చెప్పింది.