జనగామ కొత్త కలెక్టరేట్ ​బిల్డింగ్​లో నాణ్యతా లోపాలు

జనగామ కొత్త కలెక్టరేట్ ​బిల్డింగ్​లో నాణ్యతా లోపాలు
  • ఉరుస్తున్న కలెక్టరేట్​  
  • కురుస్తున్న కార్పొరేషన్​ ఆఫీస్
  • జనగామ, ఖమ్మంలలో ఇదీ సర్కారు ఆఫీసుల పరిస్థితి
  • రెండూ కొత్త బిల్డింగులే  

జనగామ/ ఖమ్మం : రూ.67 కోట్లు ఖర్చు పెట్టి ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్ ​అట్టహాసంగా ప్రారంభించిన జనగామ కొత్త కలెక్టరేట్ ​బిల్డింగ్​ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ భవనం పనులు పూర్తి చేయడానికి నాలుగేండ్లకు పైగానే పట్టింది. ఫిబ్రవరి 11న ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణలోనే ఎక్కడా లేని విధంగా జనగామ కలెక్టరేట్​ బిల్డింగ్​ను నిర్మించారని కితాబు ఇచ్చారు. అయితే మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బిల్డింగ్​ అసలు రంగు బయటపడింది. మొదటి అంతస్తులోని జిల్లా పంచాయతీ ఆఫీస్​లో గోడలకు చెమ్మ రావడంతో పాటు కరెంట్​లైట్ల కోసం అమర్చిన రౌండ్​షీట్​( సీలింగ్​రోస్​)లో నుంచి చుక్కలు చుక్కలుగా నీటి బొట్లు కారుతున్నాయి . దీంతో ఉద్యోగులు ప్లాస్టిక్ ​టబ్​ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రెండో అంతస్తులోని జిల్లా లేబర్​ ఆఫీస్​, ఖజానా ఆఫీస్​, జిల్లా ఇంటర్ ​విద్యాశాఖ ఆఫీస్​, డీఎం ఆఫీస్​, గ్రీవెన్స్​ నిర్వహించే హాల్​ ముందు భాగం వద్ద గోడలకు చెమ్మ వస్తోంది. కలెక్టరేట్​ బిల్డింగ్​పైన ఫ్లోరింగ్​సరిగా చేయకపోవడం, నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది.  

ఖమ్మంలో నీళ్లు పడకుండా చెత్తడబ్బాలు..  
ఖమ్మం: ఖమ్మంలోని గట్టయ్య సెంటర్​లో కార్పొరేషన్ ​కొత్త ఆఫీసు భవనాన్ని కొన్ని నెలల కింద ప్రారంభించారు. ప్రస్తుత వర్షాలకు కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ బిల్డింగ్ లో నాణ్యతలోపం బయటపడింది. పలు ఫ్లోర్లలో నీళ్లు కారుతుండడంతో సిబ్బంది రంగులు వేయగా మిగిలిన డబ్బాలు, చెత్త డబ్బాలు పెడుతున్నారు. వర్షపు నీరు కారుతుండడంతో పాటు గోడలకు చెమ్మ వస్తోంది. లైట్​వెయిట్​ఇటుకతో అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు వాటర్ ​క్యూరింగ్ ​కూడా సరిగ్గా చేయలేదు. దీనివల్లే ఈ సమస్య తలెత్తిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఖమ్మం ప్రజలకు సేవలందించడం కోసం ముందుచూపుతో కట్టిన ఈ బిల్డింగ్ ​ఇప్పుడే కురుస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్​ నాసిరకం పనులు, అధికారుల పర్యవేక్షణ లోపం కనబడుతోందంటున్నారు.