
- దేశంలో సగానికి పైగా కళాశాలల్లో క్లాసులే జరుగుతలేవ్
- పేషెంట్లు తక్కువగా వస్తుండడంతో ప్రాక్టీస్ కూడా లేదు
- ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ సర్వేలో వెల్లడి
- 50 శాతం ఫ్యాకల్టీ లేకున్నా ఎన్ఎంసీ పర్మిషన్లు ఇవ్వడంపై విస్మయం
- విద్యా ప్రమాణాలు మెరుగుపరచకపోతే నష్టం తప్పదని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: వైద్య విద్యలో నాణ్యత కరువవుతున్నది. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో సరైన సౌలతులు, సరిపడా ఫ్యాకల్టీ లేరు. భవిష్యత్తులో డాక్టర్లుగా పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టాల్సిన వైద్య విద్యార్థులు.. అటు పాఠాలు, ఇటు ప్రాక్టీస్ లేకుండానే చదువు పూర్తి చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నుంచి అరకొర నాలెడ్జ్ తోనే డాక్టర్లుగా బయటకు వస్తున్నారు.
దీంతో వాళ్లు సొంతంగా ప్రాక్టీస్ చేయాలన్నా భయపడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) నిర్వహించిన ‘రివ్యూ మెడికల్ సిస్టం’ సర్వేలో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2 వేల మంది విద్యార్థులు, ప్రొఫెసర్ల నుంచి ఫైమా అభిప్రాయాలు సేకరించింది.
ఈ సర్వేలో ఎయిమ్స్, పీజీఐ, జిప్మెర్ వంటి కాలేజీల్లోని ప్రొఫెషనల్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండమాన్ నికోబార్ నుంచి కూడా పలువులు డాక్టర్లు ఈ సర్వేలో పాల్గొనడం విశేషం. సర్వేలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్లు, ప్రొఫెషనల్స్ ను మెడికల్ కాలేజీల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ స్ట్రెంత్, ఓవరాల్ ట్రైనింగ్ గురించి ఆరా తీయగా..ఈ డొల్లతనం బయటపడింది.
ఏదీ సక్కగా లేదు..
వైద్య విద్యార్థులకు థియరీతో పాటు క్లినికల్ ప్రాక్టీస్ కూడా ముఖ్యమైనదే. అయితే మెడికల్ కాలేజీలకు వచ్చే పేషెంట్ల సంఖ్య తక్కువగా ఉంటున్నదని ఈ సర్వేలో తేలింది. దీంతో స్టూడెంట్లు సరిగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నట్లు వెల్లడైంది. 71.5 శాతం మంది విద్యార్థులు తమకు రోగులను పరీక్షించే అవకాశం తగినంతగా రాలేదని వాపోయారు. కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నట్లు సర్వే స్పష్టం చేసింది. తమ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఉన్నట్లు 68.8 శాతం మంది విద్యార్థులు పేర్కొన్నారు.
అలాగే తమకు రెగ్యులర్ గా టీచింగ్ సెషన్స్ జరగడం లేదని 54.3 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ల్యాబ్స్, ఇతర ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఏమాత్రం బాగాలేవని 69.2 శాతం మంది చెప్పారు. కాలేజీల్లో నైపుణ్యాలను పెంచే స్కిల్ ల్యాబ్స్ ఉన్నాయా? ప్రశ్నిస్తే.. 44.1శాతం మంది మాత్రమే ఉన్నాయని చెప్పడం గమనార్హం.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మెడికల్ ఎడ్యుకేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని 89.4 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మందికి కూడా టైమ్‌కు స్టైఫండ్ అందడం లేదు. పని గంటలపై ఎలాంటి కంట్రోల్ లేదని, చేయాల్సిన పని కంటే ఎక్కువగా చేయాల్సి వస్తున్నదని, కేవలం 29.5 శాతం మందికి మాత్రమే ఫిక్స్ డ్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయని సర్వే స్పష్టం చేసింది.
తమతో క్లరికల్ పనులు ఎక్కువగా చేయించుకుంటున్నారని 73.9 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. పని వాతావరణం చాలా దారుణంగా, స్ట్రెస్ తో కూడుకొని ఉన్నదని 40.8 శాతం మంది తెలిపారు.
విద్యార్థుల్లో కాన్ఫిడెంట్ లేదు..
అరకొర సౌకర్యాల నడుమ వైద్య విద్యను పూర్తి చేస్తున్న విద్యార్థులు..ప్రాక్టీస్ చేయాలంటేనే భయపడుతున్నట్టు ఫైమా నిర్వహించిన సర్వేలో తేలింది. తమ స్కిల్స్ పై 70 శాతం మంది విద్యార్థులు నమ్మకంతో ఉన్నప్పటికీ.. సొంతంగా ప్రాక్టీస్ చేయగలరా? అని వాళ్లను ప్రశ్నిస్తే, కేవలం 57 శాతం మంది మాత్రమే అందుకు అవునని చెప్పారు.
అంటే ప్రస్తుత మెడికల్ విద్య.. విద్యార్థుల్లో విశ్వాసాన్ని తీసుకురాలేకపోతున్నదని అర్థమవుతున్నది. సర్వేలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను పోల్చి చూస్తే.. ప్రైవేట్ కాలేజీల్లో ఫ్యాకల్టీ ఉన్నట్లు, పేషెంట్ల సంఖ్య మెరుగ్గానే ఉన్నట్టు వెల్లడైంది. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మినిస్ట్రేటివ్ పనుల భారం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.
త్వరలో ఎన్‌ఎంసీకి నివేదిక..
దేశంలో వైద్య విద్యలో నాణ్యత లోపిస్తున్నదని, దాన్ని గాడిలో పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఫైమా కోరింది. మెడికల్ కాలేజీల్లో ల్యాబ్స్, ఎక్విప్మెంట్, ఫ్యాకల్టీ కొరత లేకుండా చూడాలని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించింది. కాలేజీల్లో స్కిల్ ల్యాబ్స్ తప్పనిసరి చేయాలని, రెసిడెంట్లు, ఇంటర్న్‌లకు పని గంటలను ఫిక్స్ చేయాలని పేర్కొంది.
విద్యార్థుల మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి ప్రత్యేకంగా కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. త్వరలోనే తమ నివేదికను ఎన్ఎంసీ, నీతి ఆయోగ్‌కు సమర్పిస్తామని ఫైమా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అక్షయ్ డోంగర్డివే, చైర్మన్ డాక్టర్ మనీష్ జంగ్రా తెలిపారు.
ఇష్టారీతిన పర్మిషన్లు..
మెడికల్ కాలేజీలకు ఇష్టారీతిన పర్మిషన్లు ఇస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులిచ్చి పర్యవేక్షించాల్సిన ఎన్ఎంసీ అలసత్వం కారణంగా వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అనాటమీ, ఫిజియాలజీ వంటి కీలకమైన సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్‌ల ముఖం కూడా చూడని విద్యార్థులు ఉన్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దీనికి తోడు కాలేజీ అనుబంధ హాస్పిటళ్లలో పేషెంట్లు లేక ఓపీలు వెలవెలబోతున్నాయి. ఎన్ఎంసీ తనిఖీల సమయంలో కిరాయి ప్రొఫెసర్లను, దొంగ పేషెంట్లను తెచ్చి పెట్టి అధికారులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మెడికల్ కాలేజీలకు అనుమతులు, తనిఖీల సమయంలో అవినీతికి పాల్పడ్డారనే కారణంగా కొందరు అధికారులపై సీబీఐ కేసు కూడా నమోదు చేసింది.
మన రాష్ట్రంలో కూడా కొన్ని కాలేజీలు పేషెంట్లను, ప్రొఫెసర్లను కిరాయికి తీసుకొచ్చాయనే ఆరోపణలు గతంలో వచ్చాయి. థియరీ చదివి, క్లినికల్ ప్రాక్టీస్ లేక కనీసం పేషెంట్లను ఎలా పలకరించాలో కూడా తెలియని స్థితిలో వేలాది మంది డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. ఈ అరకొర జ్ఞానంతో సర్వీసులోకి వచ్చే డాక్టర్లతో ప్రజల ప్రాణాలకు భరోసా ఎక్కడుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.