సీఎం మనవడు తినే బియ్యమే పేద పిల్లలకూ: కేటీఆర్

సీఎం మనవడు తినే బియ్యమే పేద పిల్లలకూ: కేటీఆర్
  • అడ్డిమారి గుడ్డిదెబ్బల గెలిచిన్రు
  • నాలుగు సీట్లకే బీజేపోళ్లు హడావుడి చేస్తున్నరు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, వెలుగు: ‘బీజేపీ వాళ్లు తప్పుదారి నాలుగు ఎంపీ సీట్లు గెలిచి హడావుడి చేస్తున్నారు. అడ్డిమారి గుడ్డిదెబ్బగా కరీంనగర్ ఎంపీ సీటు గెలిచిన్రు’  అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. శుక్రవారం కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్‌ కరీంనగర్  సిటీ ప్రెసిడెంట్‌ కర్రా రాజశేఖర్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, తెలంగాణ అస్తిత్వ పార్టీ టీఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు.

సీఎం మనవడు తినే బియ్యమే పేద పిల్లలకూ..

కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్​కు ఇష్టమని, అందుకే ఒక్క జిల్లాకే నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తను మంత్రి చేసినట్లేనని చెప్పారు. ప్రజల మనసు గెలిచిన నాయకుడని సీఎం కేసీఆర్‌ అన్నారు. సీఎం మనవడు తింటున్న సన్నబియ్యాన్నే.. పేద ప్రజల పిల్లలకు కూడా అందిస్తున్నారని తెలిపారు. బీజేపీ వాళ్లు ఎక్కువ ఎగురుతున్నారని, ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.

కరీంనగర్ భీముడు గంగుల

సీఎం కేసీఆర్ ఏనాడు తప్పు చేయలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను చూశారని, కేసీఆర్ ఏమైనా తప్పు చేస్తే వాళ్లు వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్‌.. కరీంనగర్ భీముడు అని, ఆయనకు ఆవేశం ఎక్కువని అన్నారు. కరీంనగర్ కాంగ్రెస్‌లో ఒక పొన్నం ప్రభాకర్ మాత్రమే మిగిలారని చెప్పారు. ‘పొన్నంకు కోపం ఎక్కువ. రేపు ఎప్పోడో నన్ను తిడతాడు. మీరు ఏమీ అనొద్దు’ అని కేటీఆర్‌ సూచించారు.