
పన్నా: వజ్రాల గనిలో పనిచేస్తున్న నలుగురు కార్మికులకు జాక్‌పాట్ తగిలింది. రూ.40 లక్షలకు పైగా విలువచేసే 11.95 క్యారెట్ల వజ్రం దొరికింది. మరో ముగ్గురితో కలిసి కార్మికుడు మాధవ్ కృష్ణ మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా కల్యాణ్‌పూర్‌పట్టి ప్రాంతంలోని ఓ గనిలో 15 ఏండ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల తవ్వకాల్లో ఆయనకు వజ్రం దొరకగా, దానిని రూల్స్ ప్రకారం పన్నాలోని వజ్రాల కార్యాలయం అధికారులకు హ్యాండోవర్ చేశారు. ఆ వజ్రాన్ని భద్రపరిచామని, త్వరలోనే వేలం వేస్తామని అధికారులు వెల్లడించారు. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో 12 శాతం రాయల్టీని తీసేసి మిగతా డబ్బును కార్మికుడికి ఇచ్చేస్తామన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు అంచనా.