
- కాళేశ్వరం వర్క్ సైట్లలో సమస్యలు
- లక్ష్మీపూర్, మేడిగడ్డ పంప్ హౌజ్ ల వద్ద లీకేజీలు
- ‘పాలమూరు’ ప్రాజెక్టులోనూ డెడ్ లైన్లతో ఉరుకులాట
- కరివెన రిజర్వాయర్ కట్టపై పగుళ్లు
ఉరుకులాడుతూ ప్రాజెక్టుల పనులు చేయిస్తుండటంతో నాణ్యత దెబ్బతింటోందని, నిర్మాణాలలో లోపాలు తలెత్తుతున్నాయని ఇంజనీర్లు అంటున్నారు. తక్కువ టైంలో పూర్తి చేశామని చెప్పుకొనేందుకు ఆగమాగంగా పనులు చేస్తున్నారని, అన్నీ సక్రమంగా చూసుకోకపోతే ప్రాజెక్టు నిర్మాణాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. కొద్దిరోజుల కింద కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన బాహుబలి మోటార్లున్న లక్ష్మీపూర్ పంప్‌హౌజ్ డెలివరీ సిస్టర్న్వద్ద నీళ్లు లీకయ్యాయి. మూడు రోజుల కింద మేడిగడ్డ పంప్‌హౌజ్ ప్రొటెక్షన్ వాల్ నుంచి భారీగా నీళ్లు లీకై పంప్‌హౌజ్‌లో నిండాయి. అటు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్ కట్ట పలుచోట్ల తెగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల్లో ఆగమాగం పనులపై ఇంజనీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘‘మనం ఇల్లు పునాదులు తీసింది మొదలు గృహప్రవేశం వరకూ నెలల కొద్దీ టైం పడుతుంది. పద్ధతిగా ఒక్కొక్కటీ నిర్మించుకుంటూ వెళతాం. అలాంటిది వందల ఏళ్లు నిలిచి ఉండాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై ఎంత శ్రద్ధ తీసుకోవాలి. వర్క్ సైట్లలో ఎన్నో ఇబ్బందులు వస్తుంటయ్. ఇంజనీర్లుగా మేం మాత్రమే వాటిని ఫేస్ చేస్తుంటం. సీఎంకు, మంత్రులకు అవన్నీ ఎట్ల తెలుస్తయ్. ఆగమాగం పనులు పూర్తికావాలంటె ఎట్లా? పనుల్లో లోపాలు ఏర్పడితే.. వాటివల్ల వచ్చే నష్టాన్ని లెక్కగట్టలేం…” అని ఓ ఇంజనీర్ స్పష్టం చేశారు.
టార్గెట్లు పెడితే సమస్యలు వస్తున్నయ్..
చిన్న పనులు చేసేప్పుడే ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయని, భారీ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇంకెన్ని సమస్యలు వస్తాయో అర్థం చేసుకోవాలని మరో ఇంజనీర్ చెప్పారు. ‘‘ప్రతి పనికి కొంత టైం ఉంటుంది. తరచూ అధికారులను, ఇంజనీర్లను తరుముతుంటే.. టార్గెట్లు రీచ్ కావడానికి వేగంగా పనులు చేయించాల్సి వస్తోంది. దాంతో మేడిగడ్డ నుంచి లక్ష్మీపూర్ పంప్ హౌస్ వరకు అనేక సమస్యలు తలెత్తున్నాయి. కొంచెం టైమిస్తే బాగుంటది’’ అని చెప్పారు. కాళేశ్వరం ఇంజనీర్లను పరుగులు పెట్టించినట్లే, ఇప్పుడు పాలమూరు–రంగారెడ్డి ఇంజనీర్లను తరుముతున్నారని ఆ ప్రాజెక్టు పనులకు చెందిన ఓ ఇంజనీర్ చెప్పారు. ఏ టార్గెట్ లేనప్పుడు చేసిన కరివెన కట్టకు చిన్న వానలతో కోతలు పడ్డాయని, ఇప్పుడు ఆగమాగం చేస్తే సమస్యలొస్తాయన్నారు.
చానా పనులు పెండింగే..
కాళేశ్వరం ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ వద్ద ఇంకా చాలామేరకు పనులు పెండింగ్ లో ఉన్నాయి. గేట్లను 12 మీటర్ల మేర ఎత్తడానికి అవసరమైన ఐరన్ పనులు కొనసాగుతున్నాయి. బ్యారేజీకి ఇరువైపులా కరకట్ట పనులు వానలు బంద్ అయితే తప్ప పూర్తి చేసే పరిస్థితి లేదు. బ్యారేజీకి ఎడమ (మహారాష్ట్ర) వైపు కరకట్ట పక్కనే కాలువ తవ్వకం కొంత మేరకే చేపట్టారు. కుడివైపు కాలువ తవ్వకం మొదలే కాలేదు. కరకట్టల నిర్మాణం పూర్తికాకపోవడంతో బ్యారేజీలో ఎనిమిది టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు.
కన్నెపల్లి పంప్‌హౌస్ లో 2వ మోటార్ గేట్ వాల్వ్ ఇప్పటివరకు సెట్ కాలేదు. ఇటీవల ఈ మోటార్‌ను ట్రయల్ రన్ చేసినప్పుడు ప్రెజర్ వాల్వ్ లీకై నీరంతా పంప్‌హౌస్‌లోకి చేరింది. పంప్‌హౌస్‌లో 15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిండాయని, వాటిని మోటార్లతో తోడేశారని తెలుస్తోంది. పంప్‌హౌజ్ ఫోర్‌బే ప్రొటెక్షన్ వాల్ క్యూరింగ్ సరిగా చేయలేదని సమాచారం. దాంతో వాల్ దెబ్బతిని నీళ్లు లోపలికి వచ్చాయి. ఇక్కడ మూడో టీఎంసీ మోటార్ల ట్రాఫ్ట్ ట్యూబ్‌ల పనులు జరుగుతున్నాయి. ఆ చోట పెద్ద గుంత ఏర్పడి నీరు చేరింది. ఇక 8వ మోటారు వద్ద సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు తెలిసింది.
అన్నారం బ్యారేజీ సెకండ్ బ్లాక్‌లో ఒక గేటును దించే క్రమంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఇంజనీర్లు నానా ఇబ్బందులు పడి ఆ గేటును కిందికి దించారు. ఈ పంప్‌హౌస్‌లో మోటార్లలో సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఎల్లంపల్లి నుంచి నందిమేడారం పంప్‌హౌస్‌కు నీటిని తరలించే గ్రావిటీ చానల్, ట్విన్ టన్నెళ్లలోని పెండింగ్ పనులను ఆగస్టు రెండో వారం వరకు పూర్తి చేశారు. అందువల్లే అక్కడి నుంచి నీటి తరలింపులో జాప్యం జరిగింది.
లక్ష్మీపూర్ పంప్‌హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్ద ప్రొటెక్షన్ వాల్‌కు లీకేజీలు ఏర్పడి నీళ్లు బయటికొచ్చాయి. ఇంజనీర్లు మరమ్మతులు చేయించారు.
ప్యాకేజీ–7లో 30 మీటర్ల టన్నెల్ పని పూర్తి చేయడానికి ఏడాదికిపైగానే సమయం పట్టింది.
ఇలా అన్ని పంప్ హౌజుల్లో మొత్తం మోటార్లు, ఇతర ఏర్పాట్లు చేయకపోవడంతో వాటిని ట్రయల్ రన్ చేసే క్రమంలో సమస్యలు ఎదురవుతున్నాయి. మిడ్ మానేరు తర్వాతి పనుల్లోనూ అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు.